రివర్స్ కేస్ : లైంగిక వేదింపులకు గురవుతున్నానని యువకుడి ఆరోపణలు

Saturday, May 5th, 2018, 12:15:01 PM IST

మహిళ దేహం మగాడి ఆటవస్తువేమీ కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది.గత కొద్దిరోజులుగా తానూ లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్నానన్న ఓ యువకుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది. భోపాల్‌కు చెందిన రాజీవ్ శర్మ, ఓ నృత్య కళాకారిణితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. పెండ్లి చేసుకుంటానని ప్రతిపాదించగా, అందుకు ఆమె అంగీకరించింది. ఆరునెలలపాటు వారిద్దరూ కలిసి తిరిగారు. పెండ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అయితే రాజీవ్ తల్లి వ్యతిరేకించడంతో పెండ్లి జరుగలేదు. ఎలాగూ పెండ్లి చేసుకుంటున్నామని చెప్పి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఇప్పుడు పెండ్లి చేసుకోనంటున్నాడని ఆరోపిస్తూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. లైంగికదాడిగా కేసు నమోదు చేసిన పోలీసులు గత ఏడాది మార్చిలో రాజీవ్‌ను అరెస్టు చేశారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తామిద్దరం పరస్పర సమ్మతితో శృంగారంలో పాల్గొన్నామని, అది రేప్ కిందకు ఎలా వస్తుందని ప్రశ్నిస్తూ రాజీవ్ శర్మ పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయమూర్తి సుశీల్‌కుమార్ పాలో ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

పెండ్లి చేసుకుంటానని నమ్మించినందువల్లే ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో శృంగారానికి సిద్ధమై ఉండవచ్చునని, అలాంటప్పుడు దానిని మనస్ఫూర్తిగా ఇచ్చిన అంగీకారంగా భావించరాదని పేర్కొన్నారు. లైంగిక వాంఛ తీర్చుకోవడం కోసమే నిందితుడు (రాజీవ్‌శర్మ) సదరు యువతికి పెండ్లి ప్రతిపాదన చేసినట్లుగా భావించాల్సి ఉంటుందని చెప్పారు. స్త్రీ శరీరం మగాడి ఆటవస్తువు కాదు. మహిళ సమ్మతించేలా ఉద్దేశపూర్వకంగా ఒత్తిడి చేసి శృంగారానికి పాల్పడడం నీచమైన చర్య. అందుకు నిందితుడు తగిన శిక్ష అనుభవించాల్సిందే అని న్యాయమూర్తి పేర్కొన్నారు.