ఫోన్ చేసి అకౌంట్ లో వున్న డబ్బులు ఎలా దోచేసాడంటే!

Tuesday, May 22nd, 2018, 01:37:23 PM IST

డిజిటల్ టెక్నాలజీ రోజు రోజుకి ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ దానిని మంచి పనులకే కాదు కొందరు మోసగాళ్లు చెడు పనులకు కూడా వాడుతున్నారు. ఇటీవల మేము బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నాము, మీ ఏటీఎం కార్డు తదితర వివరాలు చెప్పండి అని చేసే ఫిషింగ్ కాల్స్ పట్ల ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలి అని బ్యాంకు అధికారులు, పోలీసులు ఎంత చెప్పినప్పటికీ కొందరు పెడచెవిన పెడుతున్నారు. విషయం లోకి వెళితే, వరంగల్ రూరల్ కౌకొండ గ్రామానికి చెందిన మాడిశెట్టి రమేష్ కు ఈ నెల 14న ఒక వ్యక్తి కాల్ చేసి మేము ఫలానా బ్యాంకు నుండి కాల్ చేస్తున్నాము మీ ఏటీఎం కార్డు అప్ డేట్ చేయాలి, కార్డు నెంబర్ చెప్పమని, లేకపోతే మీ కార్డు వెంటనే బ్లాక్ అవుతుందని చెప్పాడు. దానికి కొంచెం కంగారుపడ్డ రమేష్ వెంటనే అతనికి ఏటీఎం కార్డు పై న వున్న నెంబర్లు చెప్పాడు. వెనువెంటనే తన ఫోన్ కి ఓటీపీ వచ్చింది.

అదికూడా చెప్పాలని కోరగా చెప్పేసాడు రమేష్. మీ కార్డు అప్ డేట్ అయింది రేపు చెక్ చేసుకోండి అని చెప్పగానే నిన్న రమేష్ ఏటీఎం మిషన్ లో తన కార్డు పెట్టి బ్యాలెన్స్ చెక్ చేయగా అందులో రూ.50వేలు మాయమయినట్లు తెలుసుకుని నిర్ఘాంతపోయాడు రమేష్. వెనువెంటనే వరంగల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగా స్థానిక ఎసై మోహన్ బాబు ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు. ప్రజలకు ఎన్నిసార్లు ఈ ఫిషింగ్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్పినప్పటికీ కొందరు మాత్రం వీటిని పెద్దగా లెక్కచేయడంలేదని, ఇకపై ఎవరైనా ఇలా కాల్ చేసి బ్యాంకు అకౌంట్, క్రెడిట్, డెబిట్ కార్డు డీటెయిల్స్ అడిగితే వెంటనే తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు చెపుతున్నారు……