అసూయతో పార్సిల్ బాంబు పంపి హత్య!

Thursday, April 26th, 2018, 01:28:53 PM IST

రోజు రోజుకి మనుషుల్లో పైశాచికత్వం, అసూయ, ఈర్ష్య, ద్వేషాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయి, అనేదానికి నిదర్శనమే మనం ఇప్పుడు చెప్పుకోబోయే సంఘటన. కొద్దిరోజుల క్రితం ఒడిశా లో తీవ్ర సంచలనం సృష్టించిన పార్సెల్ బాంబు పేలుడు ఉదంతాన్ని ఎట్టకేలకు పోలీస్ లు చేధించారు. అయితే ఇదంతా చేసిన దోషి ఎవరో విని అందరూ ఆశ్చర్యపోయారు. విషయం లోకి వెళితే ఫిబ్రవరి 18న కటక్ లోని బోలాన్గిర్ లో జరిగిన ఒక వివాహ మహోత్సవానికి అందరూ చదివింపులు, బహుమతులు చదివించారు. అయితే వివాహ అనంతరం అదే నెల 23న బహుమతులు ఒక్కొక్కటి తెరుస్తుండగా, వున్నట్లుండి ఒక బహుమతి బాక్సు పేలి ఇద్దరు మరణించగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

అయితే ఈ విషయమై లోతుగా విచారణ చేపట్టిన పోలీస్ లు ఇప్పటికి నిందితుడిని అరెస్ట్ చేసారు. అయితే తాను ఎవరో కాదని పెళ్ళికొడుకు తల్లి పని చేసే కాలేజీలో సహోద్యోగి అని తెలిసింది. పెళ్ళికొడుకు తల్లి సంజుక్త, జ్యోతి వికాస్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తుంది. అదే కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న పుంజిలాల్ మెహర్ తనకు బదులుగా సంజుక్త ను ప్రిన్సిపాల్ గా చేసినందుకు కుట్రపన్ని ఆమె కుటుంబాన్ని అంతమొందించాలి అనుకుని, ఆమె కుమారుడు వివాహం అని తెలుసుకుని వివాహానికి ఒక బాంబు ను పార్సెల్ చేసి బహుమతిగా పంపాడు.

కాగా బాంబు పేలిన సమయంలో పెళ్ళికొడుకు, అతని బామ్మ మృతి చెందగా, పెళ్లి కూతురికి తీవ్రగాయాలు అయ్యాయని పోలీస్ లు చెపుతున్నారు. అయితే అందరిలా పుంజిలాల్ ను విచారించిన పోలీస్ లు అనుమానంతో అతనిని గట్టిగా ప్రశ్నించగా విషయం మొత్తం చెప్పాడు. అతడు ఆ బాంబు తయారీకి దాదాపు ఏడు నెలలపాటు ఇంటర్నెట్ లో సెర్చ్ చేసినట్లు చెప్పాడు. ఆ తరువాత పలు చిన్న చిన్న బాంబులు చేసి శాంపిల్ గా ట్రైల్స్ కూడా వేసి చూశాడట. మొత్తానికి అతని బండారం బయటపడడంతో పోలీస్ లు అతన్ని అరెస్ట్ చేసి జైలు కు పంపారు. తమకు విద్యాబుద్ధులు చెప్పే ఒక లెక్చరర్ ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టడం ఆశ్చర్యంగా ఉందని వికాస్ కళాశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు…..