కడపలో కలకలం రేపుతున్న ఎస్ఐ భార్య ఆత్మహత్య !

Tuesday, April 17th, 2018, 09:16:20 PM IST

తన కుమారుడికి చికిత్స విషయంలో భార్య, భర్తల మధ్య స్వల్పవిభేదాలు ఏర్పడి క్షణికావేశంలో ఒక ఎస్ఐ భార్య ఆత్మహత్య చేసుకొంది. రాజంపేట పట్టణంలోని మన్నూరు సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తో ఆ ప్రాంత వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విషయంలోకి వెళితే,
మన్నూరు ఎస్‌ఐ మహేష్‌నాయుడు, భార్య సౌజన్య (28)ల వివాహం 2013లో జరిగింది. మహేష్‌నాయుడు స్వగ్రామం చిత్తూరు జిల్లా కాళహస్తి కాగా ఆయన భార్య సౌజన్య స్వగ్రామం కావలి. వారికి పూర్ణేష్‌ అనే కుమారుడున్నాడు.

అతనికి పుట్టినప్పటి నుంచి మాటలు రావు. తమ బిడ్డకు మాటలు రావడానికి భార్యాభర్తలిరువురు అనేక ఆసుపత్రులకు వెళ్లి ప్రముఖ డాక్టర్ల దగ్గర వైద్యం చేయించినట్లు తెలిసింది. అయినా మాటలు రాలేదు. తిరిగి అతనికి మరింత మెరుగైన చికిత్స చేయించాలన్న ఆతృత భార్య సౌజన్యలో ఎక్కువ గా ఉండేది. ఈ విషయమై భార్య, భర్తల మధ్య కొద్దిగా విభేదాలున్నట్లు తెలుస్తోంది. సౌజన్య ఉరి వేసుకొని మరణించే సమయానికి వారి కుమారుడు పూర్ణేష్‌ భర్త వద్దే స్టేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తన వద్ద ఉన్న పూర్ణేష్‌ను ఇంటికి తీసుకెళ్లి వదలాలని ఎస్‌ఐ ఓ కానిస్టేబుల్‌ ద్వారా ఇంటికి పంపగా తలుపులు వేసిఉన్నట్లు తెలిసింది.

వెంటనే కానిస్టేబుల్‌ అనేక మార్లు తలుపు తట్టి పిలిచినా పిలుపు రాకపోవడంతో వెనువెంటనే ఎస్‌ఐకు సమాచారం అందించినట్లు తెలిసింది. హుటాహుటిన ఇంటి వద్దకు వచ్చి తలుపులు తెరిచి చూడగా భార్య కళ్ల ముందు ఉరికి వేలాడుతున్న దృశ్యాన్ని చూసి ఎస్‌ఐ మహేష్‌నాయుడు అక్కడే బోరున విలపిస్తూ కుప్పకూలిపోయాడు. ఈ విషయం రాజంపేట డీఎస్పీ లక్ష్మీనారాయణకు సమాచారం అందించగా ఆయన హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి ఆమె మృతదేహాన్ని పరిశీలించారు.

ఘటనపై డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మన్నూరు ఎస్‌ఐ మహేష్‌నాయుడు భార్య సౌజన్యల మృతిపై పూర్తిస్థాయి విచారణ చేసి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. ప్రాథమికంగా తమకందిన సమాచారం ప్రకారం వారి మధ్య తమ కుమారుడు పూర్ణేష్‌కు మాటలు రాని విషయంపై క్షణికావేశానికిలోనై సౌజన్య ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని, పూర్తి వివరాలు వారి బంధువులు, చుట్టుపక్కల వారి ద్వారా సేకరించి త్వరలో వెల్లడిస్తామన్నారు…..