షారూఖ్ సినిమాకు 1000 వారాలు పూర్తి..!

Friday, December 12th, 2014, 06:37:59 PM IST


బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ మూవీ చరిత్ర సృష్టించింది. మరే సినిమా సాధించలేని అద్భుత విజయం సాధించింది. షారుఖ్ ఖాన్ – కాజోల్ జంటగా నటించిన ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ భారత సినీ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ మూవీ ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్ లో 19 ఏళ్ల పాటు ప్రదర్శితమై 20వ ఏడాదిలోకి అడుగు పెట్టింది. ఈ రోజుతో ఆ సినిమా సరిగ్గా 1000 వారాలు పూర్తి చేసుకుంది. తొలి రోజు లాగే ఇవాళ కూడా ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ సాధించింది.

1995, అక్టోబర్ 20న విడుదలైన ఈ చిత్రం, ఇప్పటికీ ఆ థియేటర్ లో రోజూ ఉదయం ఆటగా ప్రదర్శిమవుతోంది. వెయ్యి వారాలు పూర్తి చేసుకుని ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్న ఆ చిత్రాన్ని ఇక ఆ థియేటర్ నుంచి తీసేస్తున్నారు. ఈ సందర్భంగా థియేటర్ వద్ద భారీగా చిత్రయూనిట్ ఓ వేడుకను ఏర్పాటు చేసింది. యాశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఆదిత్య చోప్రా తెరకెక్కించాడు. నాడు ప్రేమ జంటలను విశేషంగా ఆకట్టుకుని కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రానికి నేటికీ ఆదరణ తగ్గకపోవడం ఈ సినిమాకున్న స్పెషాలిటీ.