రివ్యూ రాజా తీన్‌మార్ : శతమానం భవతి – ఎమోషన్స్ బాగున్నాయి కానీ కథే పాతదైంది !

Saturday, January 14th, 2017, 02:24:32 PM IST


తెరపై కనిపించిన వారు : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్

కెప్టెన్ ఆఫ్ ‘శతమానం భవతి’ : వేగేశ్న సతీష్

మూలకథ :

ఆత్రేయపురం అనే ఊర్లోని రాజుగారు (ప్రకాష్ రాజ్), జానకమ్మ (జయసుధ) దంపతుల ముగ్గురు పిల్లలు విదేశాల్లో స్థిరపడిపోగా, రాజుగారు మాత్రం తన ఊర్లోనే భార్య జానకమ్మ, మనవడు రాజు (శర్వానంద్)తో కలిసి ఉంటారు. విదేశాల్లో స్థిరపడిపోయి ఎప్పుడూ తమను చూడడానికి కూడా రాని పిల్లల కోసం రాజు గారు ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఆయన ఓ పథకం వేసి, తన పిల్లలంతా సంక్రాంతికి వచ్చేలా చేస్తాడు. ఇలా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఆయన మనవరాలు నిత్యా (అనుపమ పరమేశ్వరన్), రాజుతో పరిచయం పెంచుకొని అతడితో ప్రేమలో కూడా పడిపోతుంది. కానీ రాజుగారు వేసిన పథకం ఆయన భార్యకు తెలిసి గొడవ జరుగుతుంది. రాజుగారు వేసిన ఆ పథకం ఏంటి? అసలు ఆయన తన పిల్లలకు ఏం చెప్పాలనుకొని ఆ పథకం వేశాడు? రాజు, నిత్యాల ప్రేమకథ ఏమైంది? అన్నదే ఈ సినిమా కథ.

విజిల్ పోడు :

–> సినిమాలోని క్లీన్ ఫ్యామిలీ ఎమోషన్స్ కి మొదటి విజిల్ వేసుకోవచ్చు. కుటుంబమంతా ఎంజాయ్ చేసేలా కుటుంబ విలువలను తెలిపే ఈ ఎమోషన్స్ బాగున్నాయి.

–> ఇక బావ మరదళ్లు శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ ల మధ్య నడిచిన లవ్ ట్రాక్ రిఫ్రెషింగా బాగుంది. అందులో వారిద్ధరి నటన కూడా బాగుంది. కనుక రెండవ విజిల్ ఈ అంశాలకి వేసుకోవచ్చు.

–> ప్రకాష్ రాజ్, జయసుధ, నరేష్ ల నటన, సినిమాను అందంగా మలచిన సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీకి మూడో విజిల్ వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> ఇందులో సరికొత్త కథ నేది లేకపోవడం పెద్ద మైన పాయింట్. ఇదివరకు వచ్చిన కుటుంబ కథా చిత్రాల్లాగే ఇది కూడా రొటీన్ స్టోరీగా ఉంది.

–> ఇక కథ మధ్యలో కామెడీ చేసే ప్రయత్నంలో బలవంతంగా కొన్ని సన్నివేశాల్ని మధ్యలో ఇరికించారు.

–> ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ చాలా వరకు నెమ్మదించింది. చాలా సేపటి వరకు వేగం పుంజుకోలేదు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..!

–> ఈ కుటుంబ కథా చిత్రంలో అంతగా విపరీతమనిపించే సన్నివేశాలైతే ఏమీ లేవు.

ఇక చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల సంభాషణ ఇలా సాగింది..

మిస్టర్ ఏ : ఫ్యామిలీ ఎమోషన్స్ ని చాలా బాగా చూపించారు కదా..
మిస్టర్ బి : ఎమోషన్స్ బాగానే చూపారు కానీ.. కథ మాత్రం పాతదే.
మిస్టర్ ఏ : అవును అక్కడే కాస్త నిరుత్సాహం వచ్చింది.
మిస్టర్ బి : కథ కాస్త కొత్తగా ఉండి ఉంటే సినిమా ఇంకా బాగుండేది.