హమ్మయ్య.. ‘పొత్తు’ పొడిచింది!

Tuesday, September 23rd, 2014, 03:27:07 PM IST


పాతికేళ్ల బంధం బద్దలవుతుందన్న వేళ ఆ రెండు పార్టీలు ఓ కొలిక్కివచ్చాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ-శివసేన మధ్య సీట్ల సర్దుబాటు సమస్య పరిష్కారమైంది. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య నెలకొన్న వివాదం ముగిసింది.

మొత్తం 288 అసెంబ్లీ సీట్లకు గానూ శివసేన 151, బీజేపీ 130 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. మిగతా ఏడు స్థానాల్లో కూటమిలోని ఇతర పార్టీలు పోటీ చేస్తాయి. ఒకవేళ బీజేపీ-శివసేన కూటమి ఎన్నికల్లో గెలుపొందితే తమకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన కోరినట్లు సమాచారం. దీంతో సీట్ల సర్దుబాటుపై బీజేపీ – శివసేన పార్టీల మధ్య గత కొన్ని రోజులుగా నెలకొన్న స్తబ్దతకు తెరపడింది.

సీట్ల సర్దుబాటు, ఎన్నికల పొత్తు కొనసాగించడానికి ఇరు పార్టీల నేతలు ఈ రోజు భేటీ అయ్యారు. దీనిపై ఇరు పార్టీలు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 15న జరగనున్నాయి.