షాకింగ్ న్యూస్ : పెళ్లికి ఒక్కరోజు ముందు కుమార్తెను దారుణంగా చంపేసిన తండ్రి

Friday, March 23rd, 2018, 04:12:52 PM IST


నేటి కాలంలో పరువు హత్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మనం ఎంత డిజిటల్ యుగంలో ఉన్నప్పటికీ కులం, మతం వంటి రుగ్మతల కారణంగా కొందరు బలికాకతప్పడం లేదు. ఇటీవల కేరళలో తన కూతురు ఒక తక్కువ కులం వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసుకుంటుందని కక్ష కట్టిన తండ్రి ఆమెను అత్యంత కర్కశంగా నరికి చంపిన సంఘటన ఆ ప్రాంతం వారిని భయభ్రాంతులకు గురి చేసింది. విషయంలోకి వెళితే, గురువారం అరిక్కోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, గ్రామానికి చెందిన అతిర ఓ సైనికుడిని ప్రేమించింది. ప్రేమ విషయం ఇంట్లో చెప్పి అతడినే పెళ్లాడతానని పెద్దలను ఒప్పించింది.

కుమార్తె ప్రేమించింది దళితుడిని కావడంతో ఆమె తండ్రి రాజన్ అంగీకరించేందుకు నిరాకరించాడు. నేడు వివాహం జరగనుండగా కుమార్తె తీరును జీర్ణించుకోలేకపోయిన తండ్రి గురువారం సాయంత్రం కుమార్తెతో వాగ్వాదానికి దిగాడు. పెళ్లికి అంగీకరించేది లేదని తేల్చి చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో రెచ్చిపోయిన రాజన్ కుమార్తెపై పదునైన ఆయుధంతో మూర్ఖంగా దాడిచేశాడు. దానితో అతిర తీవ్ర గాయాలపాలైంది. రక్తపుమడుగులో కుప్పకూలిన అతిరను అక్కడున్న వారు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజన్‌ను అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో అరిక్కోడ్ లోని అతిర ఇంటివద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి….