ఎంతో ఇష్టపడి ప్రేమించిపెళ్లి చేసుకుంటే….చివరికి ?

Tuesday, April 17th, 2018, 12:16:01 AM IST

తాను ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లిచేసుకున్న వాడే రోజురోజుకి వేధింపులకు గురిచేశాడు. కనికరం లేకుండా తీవ్ర చిత్రహింసలు పెట్టసాగాడు. ఒకవైపు బయటకు చెప్పుకోలేక, మరో దారి లేక ఆ యువతి గుండె బరువెక్కింది. చివరకు తనను తాను బలవన్మరణం చేసుకొంది. ఈ హృదయ విదారక ఘటన నిజామాబాద్ లో జరిగింది. నిజామాబాద్‌ నగరంలోని గాయత్రీనగర్‌కు చెందిన ప్రవళిక(22) తన ఇంట్లో శనివారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో నిద్రమాత్రలు, ఓడోనిల్‌ను మింగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె భర్త ప్రేమ్‌ హుటాహుటినా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు.

పరిస్థితి విషమంగా ఉందని చెప్పటంతో అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. చివరకు ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందింది. అసలు విషయం ఏమిటంటే, నగరంలోని హమాల్‌వాడి ప్రాంతానికి చెందిన ప్రవళిక ఈ మధ్యనే ఫార్మసీ పూర్తి చేసింది. ఫార్మసీ చదువుతున్న సమయంలోనే ఈమె సీనియర్‌ అయిన కామారెడ్డికి చెందిన ప్రేమ్‌ అనే యువకుడితో ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఆ తర్వాత వీరివురు నాలుగు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం గాయత్రీనగర్‌లో కాపురం పెట్టారు. ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్న వీరివురి మధ్య మొదటి నుంచి చిన్న వివాదాలు నడుస్తున్నాయని తెలుస్తోంది.

అయితే తరుచూ నన్ను నీచపదజాలంతో తిడుతున్నాడని, తమ మధ్య మనస్పర్థలు వస్తున్నాయని ప్రవళిక తన తల్లితో ఫోన్‌లో చెబుతుండేదని కుటుంబీకులు తెలిపారు. చనిపోయే రోజుకి ముందు కూడా తన తల్లితో ఇదే విషయాన్ని తెలిపిందని సమాచారం. ఇంతలోనే యువతి ఆత్మహత్య చేసుకోవటం కుటుంబీకులను శోకసంద్రంలో ముంచింది. ఈ ఘటనపై నిజామాబాద్‌ పోలీసులు భర్త వేధింపుల వల్లే చనిపోయినట్లుగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తు అనంతరం తదుపరి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై శంకర్‌ వెల్లడించారు…..