ఆన్లైన్ లోనే మోసాలు ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా కొంత మంది కేటుగాళ్లు ఆన్లైన్ కంపెనీలనే మోసం చేస్తుంటారు. ఇటీవల గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే కోసమని రాడో రిస్ట్‌వాచ్ ఆన్లైన్ లో బూకం చేసిన ఒక యువకుడు ఎలాగైనా డబ్బులు ఇవ్వకుండా దాన్ని కొట్టేయాలని అనుకున్నాడు. అయితే చివరికి పోలీసుల చేతికి చిక్కి జైలుపాలయ్యాడు. అసలు వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలో మోడల్ టౌన్ సమీపంలో ఉండే వైభవ్ ఖురాన అనే 22 ఏళ్ల కుర్రాడు తన ప్రియురాలి బర్త్ డే కి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు.
అందుకోసం 90 వేల రూపాయల ఖరీదైన ఒక రాడో రిస్ట్‌వాచ్ ను ఆన్లైన్ లో ఆర్డర్ చేశాడు. తప్పుడు అడ్రస్ పెట్టి వాచ్ పార్సిల్‌తో డెలివరీ బాయ్ (సాహు) రాగానే సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద కలుసుకున్నాడు. అనంతరం డెలివెరి బాయ్ ను ఒక ఇంటికి తీసుకెళ్లి వెళ్లి కాలింగ్ బిల్లు కొట్టు మా వాళ్లు డబ్బు ఇచ్చేస్తారు. నేను నీ వెనకే వస్తా అని వైభవ్ చెప్పాడు. అప్పటికే వాచ్ తీసుకున్న వైభవ్ డెలివెరి బాయ్ ముందుకు కదలాగానే అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న డెలివెరి బాయ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం కాల్ డేటా ద్వారా వైభవ్ ను పట్టుకున్న పోలీసులు వాచ్ ను స్వాధీనం చేసుకున్నారు.