చదివింది ఉన్నత చదువు….. చేసేదేమో… ?

Wednesday, July 18th, 2018, 01:15:50 PM IST

నేటి సమాజంలో మనకు రోజు కనపడుతున్నవారు ఎటువంటి వారో, వారు ఎటువంటి పనులు చేస్తుంటారో మనుషులను చూసి చెప్పడం చాల కష్టమనే చెప్పాలి. చూడడానికి కొందరు హుందాగా కనపడతారు, మగవారైతే నీట్ గా డ్రెస్ చేసుకుని, బైక్ లలో తిరగడం, ఇక ఆడవారైతే మంచి నగలు పెట్టుకుని ఏదో పెద్ద ఉద్యోగినిగా నమ్మిస్తూ ఉండడం చేస్తుంటారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది అటువంటి ఒక మహిళ ఉదంతమే. ఇక వివరాల్లోకి వెళితే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఎమ్బిఏ చదివిన ఒక మహిళ తన ద్విచక్రవాహనం తీసుకుని చార్మినార్ లోని ఒక నగల షాపులోకి వెళ్లి నగలు కొనే నెపంతో, చాకచక్యంగా వాటిని చోరీ చేసింది. అదేవిధంగా అక్కడే గల మరొక దుకాణానికి కూడా వెళ్లి అదే విధంగా చోరీ చేయడంతో ఆ ఇరువురు నగల షాప్ ఓనర్లు చార్మినార్ పోలీస్ లకు ఫిర్యాదు చేశారు.

ఘటన విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు సిసి కెమెరాలో మహిళ ఆనవాలు ఆధారంగా వలపన్ని ఆ మహిళను ఎట్టకేలకు పట్టుకున్నారు. అయితే ఆ మహిళ పై ఇదివరకు మరొక కేసు కూడా నమోదయ్యిందని, ఆమె ఒక హాస్టల్ లో ఖరీదైన లాప్ టాప్ కూడా చోరీ చేసినట్లు పోలీస్ లు చెపుతున్నారు. తల్లితండ్రులు ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివిస్తే, తదనంతరం మంచి ఉద్యోగం చేసుకోకుండా జల్సాలకు అలవాటు పడిన కొందరు ఇటువంటి నీచ పనులకు పాల్పడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటునారని, ఎంబీఏ చదివిన ఆ మహిళకు ఇదివరకే గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పటికీ మళ్లి ఇలా చేయడంతో ఆమె పై కేసు నమోదు చేసి కోర్ట్ కి తరలించనున్నామని స్థానిక ఎస్ఐ చెప్పారు…..