అలాంటి ఎన్నారైల ఆటలు ఇక చెల్లవు!

Friday, July 27th, 2018, 06:35:57 PM IST

విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ సరికొత్త నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. దేశ విదేశాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం చూపుతున్నారు. అవసరం అయితే కొత్త తరహా చట్టానికి శ్రీకారం చుడుతున్నారు. ఈరోజు ఆమె సరికొత్త విధానాన్ని వెల్లడించారు. ఎన్నారై భర్తల కారణంగా చాలా మంది మహిళలు మోసపోతున్నారు. అలాగే వారిపై దాడులు కూడా పెరుగుతుండడంతో సుష్మాపై స్వరాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భార్యలను వదిలిపెట్టి పోయే ఎన్నారైలకు సమన్లు, వారెంట్ లు జారీ చేస్తామని చెప్పారు. అందుకోసం విదేశాంగ శాఖ ఒక ప్రత్యేకమైన పోర్టల్ ని కూడా రూపొందిస్తున్నట్లు చెప్పారు.

2015 జనవరి నుంచి గత ఏడాది నవంబర్ వరకు చూసుకుంటే ఎన్నారై భర్తల మోసాలపై వేధింపులపై 3,328 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. శారీరకంగా మానసికంగా మహిళలను హింసించే వారికి ఈ విధానాన్ని అమలుపరిచేందుకు సిద్ధపడుతున్నట్లు వివరించారు. సమన్లు అందుకున్న ఎన్నారై ల నుంచి స్పందన రాకుంటే వెంటనే ఇండియాలో ఉన్న వారి ఆస్తులను జప్తు చేయాల్సి ఉంటుందని అలాగే అపరాధులుగా ప్రకటించవచ్చని సుష్మ స్వరాజ్ వివరణ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో పోర్టల్‌ తీసుకురావడానికి సంబందించిన బిల్లు ఆమోదించేలా ప్రయత్నిస్తామని మంత్రి వెల్లడించారు.