అల్లకల్లోలంగా తమిళనాడు

Sunday, September 28th, 2014, 03:41:44 AM IST


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు బెంగుళూరు కోర్టు జైలు శిక్ష విధించడంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురైయ్యారు. తమ నాయకురాలు ఎలాగైనా శిక్ష నుండి బయటపడుతుందని ఆశించిన ఆన్నాడీఎంకే నేతలకు కోర్టు తీర్పు చెంప దెబ్బలా తగిలింది. ఇక దీనిని జీర్ణించుకోలేని మద్దతుదారులు ఆందోళనల పర్వానికి తెరతీశారు. కాగా అమ్మను దోషిగా నిర్దారించినందుకే తట్టుకోలేక రాద్దాంతం చేసిన పార్టీ శ్రేణులు ఇప్పుడు శిక్ష పడేసరికి తమ ధాటిని పెంచారు.

ఇక అన్నాడీఎంకే నేతలు డీఎంకే నేతలపైకి దాడులకు దిగుతున్నారు. అలాగే ఏకంగా సుబ్రహ్మణ్య స్వామీ, కరుణానిధుల ఇళ్ళపై రాళ్ళు రువ్వుతూ చొరపడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా రాష్ట్రవ్యాప్తంగా షాపులను బంద్ చేయిస్తున్నారు. పలు చోట్ల బస్సులను దగ్ధం చేస్తున్నారు. ఇక జయలలిత నియోజకవర్గం శ్రీరంగంలో పరిస్థితి మరీ విషమంగా మారింది. అలాగే తమిళ నాట ఉద్రిక్త పరిస్థితులను చూసి ఇతర ప్రాంతాల నుండి ఆ రాష్ట్రానికి వచ్చే బస్సులను రద్దు చేశారు. ఇక అమ్మకు శిక్ష పడడంతో తమిళనాడులో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.