ఇంకా ఏపీ మాటే వినాలంటే ఎలా?

Friday, January 2nd, 2015, 03:56:56 PM IST


తెలంగాణ విద్యాశాఖా మంత్రి జగదీశ్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్ పై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ముందుగా నోటిఫికేషన్ ఇచ్చి తప్పు చేసిందని అభిప్రాయపడ్డారు. అలాగే అసలు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది తెలంగాణ ప్రభుత్వమని, కాని ఏపీ సర్కారు తమతో సంప్రదించలేదని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ తాము చట్టానికి అనుగుణంగానే ప్రవర్తిస్తున్నామని, 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ గుర్తించాలని తెలిపారు. అలాగే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ చెప్పినట్టే వినాలంటే ఎలా? అంటూ జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. ఇక ఎంసెట్ పై ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగిస్తామని గవర్నర్ కు తెలిపామని, గవర్నర్ తమ వివరణకు సంతృప్తి చెందారని, అలాగే ఎంసెట్ అడ్మిషన్ ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండవని జగదీశ్ రెడ్డి వివరించారు.