కేసీఆర్ చంద్రబాబుకు మామూలు వార్నింగ్ ఇవ్వలేదుగా

Thursday, May 5th, 2016, 11:09:27 AM IST


తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడి, భారీ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణాలో కొత్తగా చేపడుతున్న నీటి ప్రాజెక్టులపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఏపీ లీడర్లకు కేసీఆర్ మాటలు తూటాల్లా తగిలాయి. వేల టిఎంసీల గోదావరి నీళ్ళు సముద్రంలో కలిసిపోతున్నా వాటిని వాడుకునే దమ్ము, వివేకం, తెలివి ఏపీ నాయకులకు లేవన్నారు.

తెలంగాణాకు కృష్ణా జలాల్లో 368 టిఎంసీలు, గోదావరి జలాల్లో 950 టిఎంసీలు సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడే కేటాయించినవని, వాటి ప్రకారమే ఇప్పుడు ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేశామని అన్నారు. అయినా తెలంగాణాకు గోదావరి జలాలను వాడుకోవాలంటే 500 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోయ్యాలని అదే ఆంధ్రాకి అయితే 50 నుండి 200 మీటర్లలోపు ఎత్తు లేపితే చాలని కానీ అది ఏపీ నాయకులకు చేతకావడంలేదని ఆరోపించారు. చంద్రబాబు, జగన్ లు కడుపులో కత్తులు పెట్టుకుని నోట్లో బెల్లం ఉన్నట్టు మాట్లాడతారు. తెలంగాణా ఇప్పుడు స్వాతంత్ర్య రాష్ట్రం ఎవ్వరికీ భయపడదు. మీరు ఇటుకలతో కొడితే మేము రాళ్లతో కొడతాం. మేమే బ్రతకాలి మీరు బ్రతకోద్దంటే న్యాయం కాదు అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు.