బీజేపి దూకుడు – రక్షణలో వైఎస్ఆర్ సిపీ

Friday, January 9th, 2015, 07:32:59 PM IST


బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలుగు రాష్ట్రాలలో పర్యటించడంతో కమల దళంలో జోష్ వచ్చింది. బీజేపిని క్షేత్రస్థాయి నుంచి రెండు రాష్ట్రాలలో బలోపేతం చేసేందుకు కసరత్తులు మొదలైయ్యాయి. ఇక తెలంగాణలో బీజేపి పార్టీ చెప్పుకోదగ్గ విధంగా బలంగానే ఉన్నది. భవిష్యత్తులో బీజేపి తెలంగాణలో అధికారం చేపట్టిన ఆశ్చర్యపోనక్కరలేదు. అయితే, తెలంగాణలో బీజేపికి బలమైన క్యాడర్ అవసరం ఉన్నది. అందరిని కలుపుకొని ముందుకు పోయే వ్యక్తిత్వం గల నాయకులు ఇప్పుడు తెలంగాణలో అవసరం. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వంటి నాయకులు బీజేపికి అవసరం. అటువంటి చరిష్మగల నాయకులను బీజేపి వెతికి పట్టుకోవాలి. అప్పుడు తప్పకుండా బీజేపి తెలంగాణలో విజయడంకా మోగించగలదు.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, బీజేపి అక్కడ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో బీజేపి పొత్తుఉన్న విషయం తెలిసిందే. కేంద్రంలో బీజేపి అనుసరిస్తున్న విధానాలు నచ్చి ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది నాయకులు బీజేపిలో చేరుతున్నారు. తాము ఎవ్వరినీ బలవంతంగా పార్టీలో చేరమని అడగటం లేదని, తమ సిద్దాంతాలు నచ్చి పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని బీజేపి అధ్యక్షుడు అమిత్ షా చెప్పడంతో చాలా మంది నాయకులు కమలం పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తున్నది.

ఇప్పటికే, రాయలసీమ నుంచి ముఖ్యంగా, కడపజిల్లానుంచి బలమైన నాయకులు బీజేపిలో చేరేందుకు సిద్దమయ్యారు. కందుల బ్రదర్స్, ఆదినారాయణ రెడ్డి తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కమలంలో చేరిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ లో పర్యటించడంతో మరికొంతమంది నాయకులు బీజేపిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు తెలుగుదేశం, ఇటు బీజేపిలు పోటాపోటీగా నాయకులను ఆకర్షించేపనిలో పడిపోయాయి. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ తమ నాయకులను ఇతర పార్టీలలోకి వెళ్ళకుండా కాపాడుకునే పనిలో పడిపోయింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ నాయకులను కాపాడుకోగాలుగుతుందా…? బీజేపి వ్యూహం ఫలించి రెండు రాష్ట్రాలలో బలమైన పార్టీగా ఎదుగుతుందా…? కాలమే నిర్ణయించాలి.