కొండ నాలుకకు మందేయబోతే ఆ దొంగలకు ఉన్ననాలుక ఊడింది!!

Wednesday, February 28th, 2018, 04:00:52 PM IST

సాధారణంగా బంగారు దుకాణం వ్యాపారి ఇంట్లో ఖచ్చితంగా బంగారమే, లేక డబ్బో ఉంటుంది అనే నమ్మకంతో ఒక వ్యాపారి ఇంట్లో దొంగతనం చేసిన దొంగలకు ఊహించని షాక్ తగిలింది. బెంగళూరులోని జేసీ నగర్‌లో నివసించే బంగారు దుకాణం వ్యాపారి భాటియా ఇంట్లో ఈనెల 20న దొంగలు పడ్డారు. వివిద ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డులుగా పని చేసే 7గురు వ్యక్తులు ఈ పనికి పాల్పడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే భాటియా ఇంట్లో ఖచ్చితంగా పెద్ద మొత్తంలో సొమ్ము ఉంటుందని భావించిన దొంగలు ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి ఖజానా ఖాళీ చేద్దామనుకున్నారు. అయితే వున్నట్లుండి వారి కన్ను ఆయన ఇంట్లోని లాకర్‌పై పడింది. అంతే ఉన్నపళంగా ఆ ఇంట్లో 25 కిలోల లాకర్‌ను పగలగొట్టడానికి ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా అది తెరుచుకోకపోవడంతో యజమానులు వస్తారేమోనని భయపడిన వారు చివరికి లాకర్‌నే ఎత్తుకెళ్లారు.

తమ గమ్యం చేరాక మొత్తానికి ఎలాగో లాకర్ ను ఓపెన్ చేసి చూడగా అందులో కేవలం ఒకే ఒక్క వంద రూపాయల నోటు మాత్రమే ఉండడం చూసి వాళ్ళ కళ్ళు బయ్యర్లు కమ్మాయి.భాటియా ఫిర్యాదుమేరకు పోలీస్ లు దొంగలను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టు, ఈ దొంగతనంతో వారికి వచ్చిందేమీ లేకపోగా, క్రితం దోచుకున్న రూ.7 లక్షల విలువ చేసే సోమ్మును పోలీసులు వారినుండి రికవరీ చేసుకున్నారు. కాగా ఆ దొంగల్లో భాటియా ఇంట్లో పనిచేసే వ్యక్తి కూడా ఒకరు ఉండడం విశేషం…