పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న ప్రణయ్ హత్య !

Monday, September 17th, 2018, 03:03:48 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య మెల్లగా రాజకీయ రంగు పులుముకుంటోంది. దళితుడనే నెపంతో సుపారీ ఇచ్చి అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ ను హత్య చేయించాడు. దీంతో మిర్యాలగూఢలో దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. ఇలాంటి తరుణంలోనే అమృత తన భర్త హత్యకు నక్రేకల్ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ కు చెందిన వేముల వీరేశంకు సంబంధం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేసింది.

అంతేగాక వీరేశం తన తండ్రికి చాలా సన్నిహితుడని, గతంలో కూడ ఒకసారి ప్రేమ వ్యవహారంలో తనను, ప్రణయ్ ను ఆయన బెదిరించారని చెప్పుకొచ్చింది. దీంతో వీరేశంపై అనుమానం మరింత ఎక్కువైంది. పోలీసులు కూడ ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ బ్బందుల్లో పడింది. ఒకవేళ ఈ ఆరోపణలు మరింత బలపడితే అధిష్టానం వచ్చే ఎన్నికల్లో ఆయన టికెట్టును రద్దు చేస్తుందా లేక ఇదొక బోగస్ ఆరోపణని వెనకేసుకొస్తుందా చూడాలి.

ఇప్పటికే ఈ ఆరోపణల్ని తమకు అనుకూలంగా మార్చుకునే ఆలోచనలో ఉన్న ఇతర పార్టీలు అంత సులభంగా ఈ అంశాన్ని వదిలిపెట్టవు. వీరేశం ఒక్కడిపైనే ఉన్న అనుమానాల్ని టిఆర్ఎస్ మొత్తానికి చుట్టేసి నానా రభస చేసేస్తాయి. పరువు హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరేశంపై చర్యలు తీసుకోలేదని, ఎన్నికల్లో నిలబెడుతున్నారని కేసిఆర్ ను ఏకిపారేస్తాయి. దీంతో ప్రజల్లో పార్టీ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదముంది. మరి ఊహించని ఈ కష్టాన్ని కేసీఆర్ ఎలా ఎదుర్కుంటారో చూడాలి.