తెరాస రచ్చ మామూలుగా లేదుగా. తెలంగాణలో ముందస్తు నగారా మోగిన నాటి నుంచి తెరాస ప్రచారంతో హోరెత్తిస్తోంది. తన ప్రచార ఎత్తుగడతో ప్రత్యర్థులపై దూకుడు చూపిస్తున్న తెరాస హైటెక్ ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తెరాస అస్ట్రేలియా యువజన విభాగం కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టి ప్రపంచ వ్యాప్తంగా తెరాస పేరు వినిపించేలా చేశారు. దీనికి వేదికగా బుధవారం బ్రిస్బేన్‌లో జరిగిన ఇండియా- ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్ ను వాడుకున్నారు.
తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా అధ్యక్షుడు శ్రీకర్‌రెడ్డి అండెం ఆధ్వర్యంలో దాదాపు 150 మంది తెలంగాణ ఎన్నారైలు తెరాస తరుపున ప్రచారం చేపట్టి అందరినీ ఆకట్టుకున్నారు. ఇండియా క్రికెట్ జట్టు జెర్సీలతో ఎన్నారైలు స్టేడియంలోని నలుమూలలకు బృందాలుగా వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని కేసీఆర్, కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవిత ఫొటోలున్న ప్లకార్డులను ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రచారంలో నూకల ప్రవీణ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, శ్రీకాంత్ పొగాకు, సునీల్ నన్నపనేని, రామారావు, కిరణ్ పర్వతనేని తదితర ఎన్నారైలు పాల్గొన్నారు. ఈ ఫొటోలని చూసిన కవిత ట్విట్టర్లో ఆనందాన్ని వ్యక్తం చేసింది. గబ్బా స్టేడియంలో మిమ్మల్ని చూసినందుకు ఆనందంగా వుందని ట్వీట్ చేసింది.