టైమ్ చూసి మోడీకి పంచ్ ఇచ్చిన ట్రంప్ !

Sunday, October 28th, 2018, 03:53:55 PM IST

ప్రధాని మోడీ తన పనితనం ఎలాంటిదో దేశ ప్రజలకు వివరించడానికి అవలంభించిన చర్యల్లో విదేశీ పర్యటనలు, అగ్ర దేశాల అధ్యక్షులతో సాన్నిహిత్యం, వారిని మన దేశానికి తీసుకురావడం వంటివి కూడ ఉన్నాయి. వీటి మూలాన మోడీ ఇమేజ్ యువతలో బాగా పెరిగింది. మోడీ అధికారంలోకి వచ్చితిన్ కొద్దీ కాలంలోనే అమెరికా పాత అధ్యక్షుడు ఒబామాను 2015 రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానించడం ఆయన కూడ అన్ని పనుల్ని పక్కనబెట్టి హాజరవడం జరిగాయి. ఇది మోడీ ప్రతిష్ఠను అమాంతం పెంచింది. కానీ ఈసారి మాత్రం మోడీకి అమెరికా నుండి పంచ్ తప్పలేదు.

రాబోయే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని మోడీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఆహ్వానం పంపారు. కానీ ఆ ఆహ్వానాన్ని ట్రంప్ తిరస్కరించి ఇండియా రాలేనని చెప్పారట. జనవరిలో స్టేట్ ఆఫ్ ది యూనియన్ సమావేశం ఉండటమే ఈ తిరస్కారానికి కారణమని వైట్ హౌస్ వర్గాలు చెబుతుండగా రాజకీయ విశ్లేషకుల వాదన మరోలా ఉంది.

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నెల ఆరంభంలో ఇండియాను సందర్శించినప్పుడు వారి నుండి నాలుగు ఎస్-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేలా ఇండియా వారితో భారీ ఒప్పందం చేసుకుంది. ట్రంప్ కు ఈ వ్యవహారం అస్సలు నచ్చలేదని అందుకే అమెరికా ఇలా టైమ్ చూసి మోడీకి కౌంటర్ ఇచ్చిందని అంటున్నారు. మరి ఈ పరాభవాన్ని అధిగమించడానికి మోడీ ట్రంప్ స్థానంలో ఏ దేశాధినేతను ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తారో, ఒకవేళ ఆయన ఆహ్వానించినా ట్రంప్ తిరస్కరించిన ఆహ్వానాన్ని ఏ దేశాధినేత అంగీకరిస్తారో చూడాలి.