మోడీపై ట్రంప్ సెటైర్లు – ఖండించిన భారత్..!

Friday, January 4th, 2019, 10:26:30 AM IST

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీపై సెటైర్లు విసిరారు, ఆఫ్గనిస్తాన్ లో లైబ్రరీ ఏర్పాటు చేస్తే ఎవరికీ లాభం అని విమర్శించారు. కొత్త సంవత్సరంలో తొలిసారి నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేసారు. అమెరికా ప్రజలు, ఇతర దేశాల ప్రజల కోసమే అమెరికా దళాలు ఆఫ్గనిస్తాన్ లో పని చేస్తున్నాయని అన్నారు. ఆఫ్గనిస్తాన్ పునర్నిర్మాణానికి భారత్ నుండి ఆశించినంత సహకారం అందటం లేదని అన్నారు. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ల ఏరివేతకు భారత్, రష్యా, పాకిస్తాన్ లు ఎందుకు చొరవ చూపటం లేదో తనకు అర్థం కావటం లేదని అన్నారు, 6వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా అమెరికా దళాలు అక్కడ పని చేస్తున్నాయని అన్నారు.

కొన్ని అగ్రదేశాలు ఆఫ్గనిస్తాన్ కు నమ మాత్రంగా 100, 200మంది సైనికులను పంపి తామేదో ఆఫ్గనిస్తాన్ లో శాంతి స్థాపన కోసం కృషి చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నాయని అన్నారు. భారత ప్రధాని మోడీ ఆఫ్గనిస్తాన్ లో లైబ్రరీ నిర్మాణానికి నిధులిచినట్లు తనతో పదే పదే చెప్పారని, అక్కడ లైబ్రరీ నిర్మించటం వల్ల ఎవరికీ లాభం అని ప్రశ్నించారు. ఆఫ్గనిస్తాన్ లో శాంతి స్థాపన కోసం, పునర్నిర్మాణం కోసం అమెరికా చూపిస్తున్న చొరవ, ఖర్చుతో పోలిస్తే, ఇతర దేశాలు ఖర్చు చేస్తున్నది చాలా తక్కువని అన్నారు ఈ వ్యాఖ్యలపై భారత్ స్పందించింది, ఆఫ్గనిస్తాన్ పునర్నిర్మాణంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని, ఆఫ్గన్ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచే కార్యక్రమాలతో పాటు మౌలిక వసతులు కూడా పెంపొందించే ప్రాజెక్టులు చేపడుతున్నట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా బీజేపీ కార్యదర్శి ట్రంప్ వ్యాఖ్యలను ఖండించారు “ట్రంప్ ఆఫ్గనిస్తాన్ లో భారత్ చేస్తున్న ఇతర సహాయ కార్యక్రమాలను ట్రంప్ విస్మరిస్టున్నారని అన్నారు, లైబ్రరీ నిర్మాణంతో పాటుగా అక్కడ స్కూళ్లు, రోడ్లు, డ్యామ్ లు నిర్మిస్తున్నాం అని, అంతే కాకుండా పార్లమెంట్ భవనం కూడా నిర్మిస్తున్నాం” అని అన్నారు, ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసారు.