రాజకీయ చదరంగంలో ‘చంద్రులు’..!

Sunday, October 12th, 2014, 01:23:01 AM IST

babu-kcr
తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావోస్తుంది. గులాబీ దళం ఇప్పటికీ అదే ఉత్సాహంతో ఉరకలేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో లభించిన విజయాన్ని ఆలంబనగా చేసుకుని.. తెలంగాణ వ్యాప్తంగా పట్టుసాధించేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఓ వైపు పాలనలో సమూల మార్పులపై దృష్టి సారిస్తునే.. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు…పార్టీకి పట్టులేని ప్రాంతాల్లో గట్టి నేతల వలసనలను ప్రోత్సహిస్తూ ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు దూకుడుగానే ముందుకు వెళ్తున్నారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ప్లీనరీని ముందుగా ఈ నెల 11,12న గ్రాండ్ గా నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేక కమిటీలను సైతం వేశారు. అంతేకాదు సగం వరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ సమావేశాల్లోనే పార్టీలోకి వలస వచ్చే టీడీపీ నేతలను పరిచయం చేసి… టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకిచ్చేందుకు పక్కాగా స్కెచ్ వేశారని అంటున్నారు. అయితే కేసీఆర్ ప్లీనరీ వ్యూహాన్ని ముందే పసిగట్టిన.. టీడీపీ కూడా అదే రోజున బస్సు యాత్ర తో కౌంటర్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంది. కరెంటు కోతలతో అల్లాడుతున్న రైతులను కలవడంతో.. రైతు రుణమాఫీ.. ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబాలను పరామర్శించడంతో… కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపించాలని తెలంగాణ టీడీపీ నేతలు నిర్ణయించారు. దీంతో టీడీపీ పై ఎత్తుతో ఖంగుతిన్న గులాబీ బాస్.. సీఎం చంద్రశేఖర్ రావు… తుపాను పేరుతో ప్లీనరీని వాయిదా చేశారు.

ప్లీనరీ రద్దుతో కాసింత నిరాశలో ఉన్న టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకే… సీఎం కేసీఆర్ మళ్లీ ఆపరేషన్ ఆకర్షన్ ను తెరపైకి తీసుకువచ్చారని రాజకీయ విశ్లేషకులంటున్నారు. గురువారం నాడు టీడీపీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, ధర్మారెడ్డితోపాటు ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ సీఎం కేసీఆర్ ను కలిశారు. ఆ తర్వాత ఏపీ సీఎం..టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై… తలసాని, తీగల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో కరెంటు కష్టాలకు చంద్రబాబే కారణమని విమర్శించారు. తెలంగాణ టీడీపీలో నాయకులు లేనట్లు…పార్టీ తెలంగాణ బాధ్యతలను లోకేష్ కు అప్పగించాలని చూస్తున్నారని తలసాని అన్నారు. అటు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకే తాము టీఆర్ఎస్ కు అండగా ఉంటామని తీగల చెప్పారు.

అయితే ఈ పరిణామం జరిగిన కొద్దిసేపటికే అప్రమత్తమైన చంద్రబాబు.. ఏపీ సచివాలయంలో అందుబాటులో ఉన్న తెలంగాణ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. ఉదయం కేసీఆర్ ను కలిసిన పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లు తాము తెలుగు దేశం పార్టీని వీడబోమని ప్రకటించారు. తమ నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసమే కేసీఆర్ ను కలిశామని.. చెప్పారు.

అయితే ఈ నేతలిద్దరు కేసీఆర్ తో ప్యాకేజీ కుదరకనే తిరిగి వెనక్కి వచ్చారని వాదనలు వినిపిస్తున్నాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి పదవితోపాటు.. తన కుమారుడికి GHMC మేయర్ పదవీని ఆశిస్తున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇక తీగల కృష్ణారెడ్డి తన వ్యాపార ప్రయోజనాలు ఆశించే టీఆర్ఎస్ లోకి మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వీరు మాత్రమే టీఆర్ఎస్ లో చేరే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు ధర్మారెడ్డిని, ప్రకాష్ గౌడ్ ను చంద్రబాబే.. తలసాని, తీగల వెంట పంపించారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ ను కలిసిన తర్వాత ఈ నేతలిద్దరు మాట మార్చడం ఈ వాదనలకు బలం చేకూర్చుతోంది. ఇక ఇప్పుడు టీడీపీని వీడిన తీగల, తలసాని, టీఆర్ఎస్ అనుబంధ సభ్యులుగా కొనసాగుతారా..? లేక పార్టీలో చేరుతారా ? అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. వీరు టీఆర్ఎస్ లో చేరితే పార్టీ ఫిరాయింపుల నిరోధకచట్టం ప్రకారం…ఎమ్మెల్యే పదవీని కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ భయంతోనే ప్రస్తుతానికి కేసీఆర్ కు అండగా ఉంటామని చెబుతున్నా.. టీఆర్ఎస్ లో చేరుతున్నామని ధైర్యంగా చెప్పలేక పోతున్నారు.

అటు ఏపీలో చంద్రబాబు కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్, వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు. అయితే ఇక్కడ వైసీపీ నేతలు స్వచ్ఛంధంగానే పార్టీలోకి వస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అదే తెలంగాణలో మాత్రం.. టీఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేసి తమ నేతలను పార్టీలోకి చేర్చుకుంటోందని ఆరోపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు చంద్రుల రాజకీయ చదరంగం ఏ మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.