సినిమాకి అని తీసుకెళ్లి…రూ.లక్షకు అమ్మేశారు!

Friday, April 6th, 2018, 03:40:34 PM IST

ప్రస్తుత సమాజంలో ఆడవారి రక్షణ ఎంత కరువైందో మనం కొన్ని సంఘటనలను బట్టి చూస్తున్నాం. అయితే కొందరు మహిళలు వారిపట్ల జరుగుతున్న దాడులను తిప్పికొడుతుంటే మరికొందరేమో వాటికి బలవుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం వింటే ప్రతిఒక్కరి గుండె చలించకమానదు. విషయం ఏమిటంటే పదమూడేళ్లకే సంసారమంటే ఏంటో తెలియని వయసులో అత్తారింట్లో అడుగుపెట్టిన ఒక మహిళ కన్నీటి వ్యధ ఇది. అత్తింటికి వెళ్లింది మొదలు రోజూ వేధింపులే. ఆ పరిస్థితుల్లోనే గర్భం. పాప పుట్టిన మూడు నెలల తరువాత అత్తింట్లో అడుగుపెట్టిన నాకు మళ్లీ నిరాశే. అవే వేధింపులు, సూటిపోటి మాటలు. ఇక అక్కడ ఉండలేనని నిర్ణయించుకుని పుట్టింటికి తిరిగొచ్చేశా. పూటగడవక అమ్మానాన్నలు ఉపాధి కోసం రాయచోటికి బయలుదేరారు. వారితో పాటు నేనూ. అక్కడే నా జీవితం పూర్తిగా తలకిందులైపోయింది. మా ఇంటికి దగ్గర్లోనే రమణమ్మ, సుబ్బలక్ష్మీ, నాగలక్ష్మీ అనే ముగ్గురు మహిళలు ఉండేవారు.

నాతో చనువుగా, అభిమానంగా ఉండేవారు. అమ్మానాన్నలు లేని సమయం చూసి నాతో కబుర్లు చెప్పేవారు. ఒక రోజు సినిమాకని చెప్పి నన్ను, పుష్ప అనే మరో దివ్యాంగురాలైన అమ్మాయిని తీసుకెళ్లారు. హాల్లో మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చారు. కళ్లు తెరిచి చూసేసరికి ఏదో రైల్లో ఉన్నాం. పూర్తిగా స్పృహ వచ్చేసరికి మహారాష్ట్రలోని భివండీలోని ఓ వ్యభిచార గృహంలో తేలాం. ఎక్కడ రాయచోటి? ఎక్కడ భివండీ? అసలు అక్కడికి ఎలా వెళ్లామో మాకే తెలియని అయోమయ స్థితి. గట్టిగా అడుగుదామంటే భాష రాదు. వారెవరో తెలియదు. కానీ రాయచోటిలో మమ్మల్ని సినిమాకు తీసుకెళ్లిన మహిళలే నన్ను, పుష్పను రూ.లక్షకు వ్యభిచార గృహానికి అమ్మారని అక్కడున్న తెలుగు మహిళల ద్వారా తెలుసుకోగలిగాం. ఒక్కసారిగా మా శరీరాలు కంపించాయి. ఎలా బయటపడాలో అర్థం కాలేదు. ప్రయత్నించిన ప్రతిసారీ విఫలమయ్యాం.

నాలాగే అక్కడ నరకకూపంలో మగ్గిపోతున్న బాధిత మహిళల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశా. ఎలాగైనా అక్కడ నుంచి పారిపోదామని చెప్పా. ఈలోగా విషయం ఆ నిర్వాహకురాలికి తెలిసిపోయింది. దాంతో ఓ గదిలో బంధించి నా కాళ్లూ చేతులు కట్టేసి, కళ్లల్లో కారం పెట్టారు. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా నరకయాతన చూపించారు. అయినా అక్కడి నుంచి బయటకు రావాలన్న తపన చచ్చిపోలేదు ఎప్పటికప్పుడు నేను ప్రయత్నాలు చేయడం, అక్కడ ఉన్న మిగతావారూ నాతో చేతులు కలపడం, ఇదే పని. దాంతో తమ వ్యాపారం దెబ్బతింటుంది అనే భయంతో నిర్వాహకులు నన్నూ, నా స్నేహితురాలిని దాదాపు ఏడాది తరువాత అక్కడి నుంచి పంపించేశారు. అలా మా సొంతూరు వచ్చాం. తీరా వస్తే మా వారు రెండో పెళ్లి చేసుకున్నాడు. బిడ్డను దగ్గరకు తీసుకుంటే, నువ్వెవరు? అని అడిగింది. అమ్మ అని అంటే, అమ్మ ఎప్పుడో చనిపోయిందని చెప్పింది.

కన్నీళ్లు ఆగలేదు. నా లాంటి కష్టాలు మరొకరు పడకూడదనుకున్నా. అందుకే వారిని చట్టానికి పట్టించాలనే ఆలోచనతో రెడ్స్‌ అనే ఎన్జీఓ సాయంతో… పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టా. మొదట పోలీసు అధికారులు కేసు నమోదు చేయలేదు. దీంతో ఉన్నతాధికారులూ, మీడియా సాయం తీసుకున్నా. చివరకు నేనే గెలిచా. దాదాపు ఐదేళ్ల తరువాత నన్ను భివండీలో అమ్మిన వారికీ, కొన్నవారికీ, వ్యభిచార గృహ నిర్వాహకులకు న్యాయస్థానం ఏడేళ్లు జైలు శిక్ష వేసింది. ఆ రోజు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. భివండీ నుంచి నేనైతే వచ్చేశా. కానీ ఆ నరకకూపంలో మగ్గిపోతున్న వందల మంది మహిళల పరిస్థితి ఏమిటీ. అందుకే వారిని కాపాడేందుకు పోలీసులకు ఆ సమాచారమిచ్చా. ఇద్దరు అమ్మాయిల్ని అమ్మే మహిళలాగా బురఖా వేసుకుని భివండీలోని అదే వ్యభిచార గృహానికి వెళ్లా. లోపల సెల్‌ఫోన్‌ను ఆన్‌ చేసి పెట్టుకున్నా. బయట పోలీసులు ఉన్నారు. వ్యభిచార గృహ నిర్వాహకులతో సంభాషణ జరుపుతున్న సమయంలో అదును చూసి వచ్చి దాడి చేశారు. అక్కడున్న బాధిత మహిళలను కాపాడారు. అలా 30 మంది తెలుగు మహిళలను ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి రప్పించగలిగాను. అంటూ తన జీవితంలోని ఒక దుర్భర ఘటనను చెప్పుకొచ్చారు ఆ మహిళ. అయితే ఆమె వ్యధనను విన్న ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల వారు ఆమె సాహసం, గుండె ధైర్యానికి మెచ్చుకుంటున్నారు…..