విజయనగరం దోపిడీ కేసులో ట్విస్ట్!

Tuesday, May 8th, 2018, 11:09:55 AM IST

నిన్న రాత్రి విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి ఐటిడిఏ పార్కు వద్ద ఇద్దరు కొత్తగా పెళ్ళైన దంపతులపై కొందరు దుండగులు దాడి చేసి భర్తను హతమార్చిన సంఘటన తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో పోలీస్ లు రకరకాల కోణాల్లో దర్యాప్తును ప్రారంభించి నిందితుల కోసం వేగవంతంగా గాలింపు చేపట్టారు. ఇంజనీరింగ్ పూర్తిచేసి కర్ణాటకలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చిట్టపులివలసకు చెందిన శంకర్రావుకు అదే మండలంలోని కడకెల్ల గ్రామానికి చెందిన గత నెల28న సరస్వతితో పెళ్లి జరిగింది.

అయితే వీరిద్దరూ నిన్న రాత్రి ద్విచక్ర వాహనం బాగుచేయించి, అలానే నగల దుకాణంలో పని ఉంటే చూసుకుని రాత్రి 8గంటల తర్వాత ఇంటికి బయలుదేరారు. తోటపల్లి ఐటిడిఏ పార్క్ వద్దకు చేరుకోగానే కొందరు దుండగులు వారిబండిని అడ్డగించి సరస్వతి మేడలో నగలు అపహరించేందుకు ప్రయత్నించారు. అయితే వారిని అడ్డగించబోయిన శంకర్రావు ను ఇనుపరాడ్ తో గట్టిగా మోదీ చంపారు. సంఘటనపై స్థానికులు పోలీస్ లకు ఫిర్యాదు చేయగా, గాయాలయిన సరస్వతిని హాస్పిటల్ లో చేర్పించి, శంకర్రావు మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.

అయితే సరస్వతి చెప్పిన వివరాలను బట్టి వెంటనే నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులకు ఊహించని షాక్ ఎదురయింది. అసలు ఈ హత్య చేయించింది భార్య సరస్వతి అని, నిజానికి తనకు శంకర్ రావు అంటే ఇష్టం లేదని, అతన్ని హతమార్చడం కోసం స్నేహితుడు శివ తో కలిసి ఈ పధకం వేసింది. శివ రౌడీ షీటర్ గోపి బృందంతో కలిసి ఈ హత్యకు పూనుకున్నాడు. కాగా నిందితులను ఎట్టకేలకు పట్టుకున్న పోలీస్ లు సరస్వతితో సహా అందరిని అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరు పరిచారు. చేతికి అందేవచ్చిన కుమారుడిని అతని భార్యే ఇలా హత్య చేయిస్తుందని అనుకోలేదని శంకర్రావు తల్లితండ్రులు భోరున విలపిస్తున్నారు. కాగా శంకర్రావు మరణంతో చిట్టపులివలసలో విషాదం అలుముకుంది…..