కేంద్రమంత్రి అనంత్‌కుమార్ పై మర్డర్ అటెంప్ట్..

Wednesday, April 18th, 2018, 09:37:31 PM IST

లారీతో ఢీకొట్టి తనను చంపేందుకు కుట్రా చేశారని ఇవాళ కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే ఆరోపించారు. మంగళవారం రాత్రి మంత్రి అనంత్‌కుమార్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓకారును లారీ ఢీకొట్టింది. ఆ వాహనంలో ఉన్న ఓ పోలీసు గాయపడ్డాడు. అయితే మరో వాహనంలో ఉన్న మంత్రి తృటిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ కేసులో ట్రక్కు డ్రైవర్ నాసిర్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై ఇవాళ ఉదయం మంత్రి ట్వీట్ చేశారు. కావాలనే ఎవరో తనను చంపేందుకు కుట్ర పన్నారని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రమాద స్థలానికి సంబంధించిన ఫోటోను కూడా ఆ ట్వీట్‌లో ఆయన ట్యాగ్ చేశారు. హవేరి జిల్లాలోని రాణేబెన్నూర్ తాలూకులో ఉన్న హైవేపై ఈ ఘటన జరిగింది. తమ వాహనం టాప్ స్పీడ్‌లో ఉన్నందున ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య స్పందించారు. అది నిర్లక్ష్యపూరితంగా జరిగిన ప్రమాదం అన్నారు. కేంద్ర మంత్రి ఆరోపణలు చూస్తూంటే ఆయన ఆలోచనలు నేరపూరితంగా ఉన్నట్లు అర్థమవుతోందని సీఎం అన్నారు.