రివ్యూ ‘రాజా’ తీన్‌మార్ : వంగవీటి – వర్మ తనకు తెలుసనుకున్నది చెప్పాడు !

Friday, December 23rd, 2016, 03:55:12 PM IST


తెరపై కనిపించిన వారు : సందీప్ కుమార్, వంశీ నక్కంటి, వంశీ చాగంటి, నైనా గంగూలీ

కెప్టెన్ ఆఫ్ ‘వంగవీటి’ : రామ్ గోపాల్ వర్మ

80ల దశకంలో విజయవాడ ప్రాంతంలో రాజ్యమేలిన గ్యాంగ్ వార్ లకు కారణమైన వంగవీటి, దేవినేని అనే రెండు కుటుంబాలు మధ్య నడిచిన ప్రతీకార పోరాటాన్ని ఈ వంగవీటి చిత్రంలో చూపారు. వంగవీటి రాధ హత్య తరువాత ఇరు కుటుంబాలు ఒకరినొకరు ఎలా చంపుకున్నారు. ఎవరెవరు చనిపోయారు. చివరికి కథ ఎలా ముగిసింది అనేదే ఈ సినిమా కథ.

విజిల్ పోడు :

–> ఈ సినిమాలో వంగవీటి రాధ, రంగాల పాత్రలు పోషించిన నటుడు సందీప్ కుమార్ చాలా సహజంగా నటించాడు. అతని వేషధారణ, ప్రవర్తన అన్నీ చాలా బాగున్నాయి. ఈ సినిమాతో అతను మంచి నటుడని విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సినిమాకి ఉన్న ప్రధాన బలాల్లో అతను కూడా ఒకడు. కనుక మొదటి విజిల్ అతనికే వేసుకోవచ్చు.

–> ఇక వాస్తవ కథను చాలా సేఫ్ గా నడుపుతూ, ప్రధాన పాత్రల వ్యక్తిత్వాన్ని చాలా వరకు ఉన్నది ఉన్నట్టు వివరిస్తూ బలమైన కథనంతో ఎలాంటి డీవియేషన్స్ లేకుండా కథను చెప్పిన వర్మ స్టైల్ కు, వాస్తవ పాత్రలను పోలిన నటుల్ని ఎంచుకోవడం, వాటిని వాస్తవంగా ప్రవర్తించేలా చేయడంలో వర్మచూపిన ప్రతిభకు రెండవ విజిల్ వేసుకోవచ్చు.

–> ఇక కథలోమరో పాత్రదారి హ్యాపీ డేస్ ఫేమ్ వంశీ కృష్ణ నటనకు, ముఖ్యమైన సన్నివేశాలకు రవి శంకర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు, దాసరి కిరణ్ కుమార్ నిర్మాణ విలువలకు, ఆర్ట్ డిపార్ట్మెంట్ పర్ఫెక్షన్ కు మూడో విజిల్ కొట్టొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమా మొత్తాన్ని చాలా ఉత్కంఠగా నడిపిన వర్మ క్లైమాక్స్ ను మాత్రం చాలా సింపుల్ గా ముగించేసి ఆఖరున చిన్న నిరుత్సాహాన్ని మిగిల్చాడు. సినిమాలో అదే పెద్ద ఢమ్మాల్ పాయింట్.

–> ఇక సినిమాలో చాలా చోట్ల భయంకరమైన రీతిలో హత్యలు, రక్తపాతం ఉండటం వలన కాస్త విపరీతమని తోచింది.

–> వర్మ వాస్తవ కథను చాలా వరకూ వివరించినప్పటికీ సేఫ్ గేమ్ కోసం అన్నట్టు కొన్ని అంశాలను పెద్దగా టచ్ చేయకుండా తనకు తెలిసింది ఇదే కనుక ఇదే చెప్పాను అన్నట్టు చెప్పాడు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..!

— > వాస్తవ ఘటనలు ఎలా జరిగాయో మనకు తెలియదు కనుక, ఇది కల్పిత కథ కూడా కాదు కనుక వర్మ చూపించిన దృశ్యాల్లోనే మనం ఆనాటి ఘటనలను ఊహించుకోవాలి. కాబట్టి ఇందులో విచిత్రంగా తోచిన సన్నివేశాల్ని మనం తప్పుబట్టలేం. ఎందుకంటే ఒకవేళ అవి నిజంగానే వర్మ చూపినట్టు జరిగుండొచ్చు. లేక వాటికి దగ్గరగా అయినా ఉండొచ్చు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : సినిమా ఎలా ఉందిరా..?
మిస్టర్ బి : వర్మ స్టైల్లో బాగానే ఉంది.
మిస్టర్ ఏ : అంటే వర్మ నిజంగానే అన్ని నిజాల్ని ఇందులో చూపించడంటావా.
మిస్టర్ బి : ఏమో చెప్పలేను. అసలు నిజాలు పూర్తిగా తెలిసిన చెప్పగలరు.