విశాఖ చిత్రసీమకు ఎప్పుడూ అడ్డానే!

Friday, November 28th, 2014, 08:31:37 AM IST


ఉత్తరాంధ్రను కుదిపేసిన హుధుద్ తుఫాను ప్రభావంతో విశాఖ నగరం అల్లకల్లోలమైన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం చొరవతో, ప్రజల ప్రయత్నంతో విశాఖ తిరిగి యధా రూపాన్ని సంతరించుకునే ప్రయత్నంలో ఉంది. కాగా గతంలో చిత్ర నిర్మాణాలు జోరుగా సాగిన విశాఖలో హుధుద్ తర్వాత నగరం స్థితిగతులపై పలు అనుమానాలతో షూటింగ్ ల సందడి తగ్గింది. అయితే విశాఖ నగరంపై అనుమానాలను పటాపంచలు చెయ్యడానికి ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ నటిస్తున్న చిత్రాన్ని అక్కడ చిత్రీకరించారు. దీనితో హుధుద్ లాంటి ఉపద్రవాలు వచ్చినప్పటికీ చిత్రసీమకు ఎప్పుడూ విశాఖ నగరమే అడ్డా అని మరోసారి రుజువైంది.

కాగా దీనిపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ ఫిలిం ఇండస్ట్రీకి విశాఖ ఎప్పుడు ప్రధాన ఆకర్షణేనని తెలిపారు. అలాగే ఇంతకు ముందు చెన్నై నుండి హైదరాబాద్ కి సినీ పరిశ్రమ మారినప్పుడు కూడా వైజాగ్ ప్రాభవం తగ్గలేదని, ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత చిత్ర సీమను విశాఖకు మార్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇక తన చిత్రాన్ని విశాఖలో నిర్మించడానికి గల కారణం హుధుద్ తర్వాత కూడా విశాఖలో అందాలు తిరిగి సంతరించుకున్నాయని బెంగాలీ, ఒడిశ చిత్రరంగాలకు పిలిపునివ్వడమేనని సురేష్ బాబు తెలిపారు. ఇక అదే విధంగా హిందూపూర్ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ సినిమాను కూడా విశాఖ పరిసరాలు, అరకు అందాల మధ్య చిత్రీకరిస్తూ హుధుధ్ తర్వాత కూడా విశాఖ చిత్రరంగానికి అడ్డానేనని నిరూపించారు.