అమరావతి నిర్మాణంలో జగన్ పాత్ర ఉంటుందా..?

Sunday, December 27th, 2015, 03:33:28 AM IST


అమరావతి.. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ కు హైదరాబాద్ రాజధాని. అయితే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లుగా విడిపోయాక.. ఏపి కి రాజధానిలేదు. రాజధానికోసం అనేక ప్రాంతాలను పరిశీలించారు. చివరకు అమరావతి పేరుతో గుంటూరు.. విజయవాడ మధ్య రాజధానిని ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇక, దసరా రోజున అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగింది. ఇక తాజగా, 2019 లో జాతీయ క్రీడలకు అమరావతి వేదిక కాబోతున్నది.

ఇంతవరకు బాగానే ఉన్నది, 2018 నాటికి మొదటి దశనిర్మాణాలను పూర్తిచేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ప్రభుత్వం రైతుల వద్ద నుంచి భూములను సేకరించింది. దసరా వెళ్లి రెండు నెలలు దాటింది. కాని, ఇంతవరకు నిర్మాణాలు మొదలు కాలేదు. మొదటగా అసెంబ్లీ భవనాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ప్రపంచంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్ కంపెనీకి డిజైన్ బాధ్యతలు అప్పగించింది. డిజైన్ ఇంకా పూర్తికాలేదు. ఒకవైపు వచ్చే ఏడాది నుంచి అసెంబ్లీ నిర్వాహణను ఆంధ్రప్రదేశ్ లోనే జరగాలని నేతలు భావిస్తున్నారు. ఇందుకు తగినంత సమయం కూడా లేదు. మరోవైపు ఇంతవరకు నిర్మాణాలు మొదలే కాలేదు.

ఇకపోతే, ప్రతి రాష్ట్రానికి రాజధాని తప్పకుండా అవసరం అవుతుంది. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదు. రాజధానిని నిర్మిస్తామని కేంద్రం గతంలో హామీ ఇచ్చింది. కాబట్టి ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా.. ఆ పనులు ఆగవని.. మొదట ప్రభుత్వం రైతుల సమస్యల గురించి.. ఎన్నికలలో ఇచ్చిన హామీల గురించి పట్టించుకోవాలని ప్రతిపక్ష నేత జగన్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అగ్నికి ఆజ్యం పోసినట్టు.. రాజధాని నిర్మాణానికి 27వేల కోట్ల రూపాయలు సరిపోతాయని కేంద్రం ప్రభుత్వం ఇటీవలే పార్లమెంట్ లో ఓ సందర్భంలో పేర్కొన్నది. మరి చంద్రబాబేమో లక్షకోట్ల రూపాయలు ఉంటేనే నిర్మాణం జరుగుతుంది అంటున్నారు. భూములను తీసుకొని సింగపూర్ కంపనీలకు ఇస్తున్నారని, అమరావతిలో సింగపూర్ బడాబాబుల హవా ఉంటున్నదని జగన్ ఆరోపిస్తున్నారు.

ఒక రాష్ట్రానికి రాజధాని నిర్మాణం జరగాలి అంటే.. అధికారంలో ఉన్న ఒక్క పార్టీదే బాధ్యత కాదు. అటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలను సైతం కలుపుకొని పోవాలి. అప్పుడే రాజధాని నిర్మాణం సవ్యంగా సాగుతుంది. అలా కాకుండా.. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ.. బురద జల్లుకుంటూ.. ఆరోపణలు.. ప్రతి ఆరోపణలతో కాలం గడిపితే.. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన మారుతుంది అమరావతి పరిస్థితి.