ఇప్పటికే ఎన్టీఆర్ దూరం.. పవన్ కూడా దూరమైతే..?

Wednesday, April 6th, 2016, 08:39:17 AM IST


ఎన్నికలకు ఇంకా మూడేళ్ళు సమయం ఉన్నది. ఇంకా మూడేళ్ళు ఉన్నది కదా అని నిమ్మళంగా కూర్చుంటే.. అవతలి పార్టీలు దూసుకుపోగలవు. ఎన్నికలు ముగిసిన దగ్గరినుంచి.. మరలా ఎన్నికలు వచ్చే వరకు కూడా నిత్యం అలర్ట్ గా ఉండాలి. అధికారంలోకి రాగానే అవతలి పార్టీలోనుంచి నాయకులను ఆకర్షించడం.. చరిష్మా ఉన్న నేతలను పార్టీలోకి తీసుకొని వారి చేత ప్రచారం చేయించుకోవడం పార్టీలు నిత్యం చేస్తుంటాయి.

గతంలోనైతే.. పార్టీల సంఖ్య తక్కువ పైగా మీడియా అంత బలంగా లేదు.. అంతేకాకుండా.. రాజకీయాల గురించి ప్రజలకు పెద్దగా తెలియవు కాబట్టి ఎన్నికలకు ముందు నాయకులు హడావుడి కనిపించేది. కాని, ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా పోటీ ఏర్పడింది కాబట్టి ప్రతిరోజూ ఎన్నికల రోజే అనుకోని ఎత్తులు పై ఎత్తులు వేస్తుంటాయి.

ఇక దీనిని పక్కన పెడితే.. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు అధినాయకత్వంలో నడుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నది. 2004లో పార్టీ ఓటమిపాలయ్యిన తరువాత.. 2009 ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని చెప్పి బాబు జూనియర్ చేత ప్రచారం చేయించారు. కాంగ్రెస్ పార్టీ హావా ఉండటంతో.. ఆ పార్టీ విజయం సాధించలేక పోయింది.

అయితే, పార్టీలో జూనియర్ కు మంచి పేరు వచ్చింది. సీనియర్ ఎన్టీఆర్ లాగా జూనియర్ కూడా రాజకీయాలలో రాణిస్తారని టాక్ వినిపించింది. కాని, చంద్రబాబు జూనియర్ ను పక్కన పెట్టారు. దీంతో అప్పటి నుంచి ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉంటున్నారు.

ఇకపోతే, 2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. కాని, ఎన్నికలలో పోటీ చేయకుండా బీజేపి, తెలుగుదేశం పార్టీలకు మద్దతు పలికారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చిన పార్టీలు గెలిచాయి. అయితే, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో పవన్ టిడిపి కాస్త దూరంగా ఉంటున్నారు. పైగా 2019 ఎన్నికలలో పోటీ చేసేందుకు పవన్ సిద్దమవుతున్నారు. పవన్ పోటీకి సిద్దమవుతున్నాడు అనగానే తెలుగుదేశం పార్టీ అలర్ట్ అయినట్టు కనిపిస్తున్నది.

ఒకవేళ పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీకి దిగితే ఎలా ఎదుర్కోవాలి.. ఎవరిని రంగంలోకి దించాలి అని ఆలోచిస్తున్నది. ఇప్పటికి ఇవి ఊహగానలే అయినప్పటికీ.. తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న తీరుతో.. కేంద్రంలో అనుసరిస్తున్న తీరుతో జనసేన అధ్యక్షుడు కాస్త అసంతృప్తితో ఉన్నారని సమాచారం. మరి ఇటువంటి సమయంలో నిజంగానే పవన్ కళ్యాణ్ బయటనుంచి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటే టిడిపి పరిస్థితి ఏమిటి.. అన్నది ఆ పార్టీనే ఆలోచించుకోవాలి.