ఏపి మార్పును కోరుకుంటే.. జగనా.. పవనా..?

Tuesday, May 17th, 2016, 08:22:21 AM IST


తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎన్నికలు ముగిశాయి. ఈనెల 19 వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ తమ పోల్స్ వివరాలను వెల్లడించాయి. ఎప్పటిలాగే తమిళనాడులో ఫలితాలు ఉంటాయని, ఐదేళ్ళు, ఒకరికి, మరో ఐదేళ్ళు మరొకరికి తమిళప్రజలు ఓటేసి గెలిపిస్తారు. ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం కొనసాగుతుందని అంటున్నారు. ఓటింగ్ కు ముందు వరకు అమ్మకే అనుకూలం అనుకుంటే, ఓటింగ్ తరువాత ఫలితాలు మారే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇక, అటు కేరళలో కూడా లెఫ్ట్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలుస్తున్నది.

ఇకపోతే, పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే తిరిగి అధికారం చేజిక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అయితే, అస్సాంలో మాత్రం కాంగ్రెస్ కు బదులు బీజేపి అధికారంలోకి వస్తుందని అంటున్నారు. కేరళలో ఎలాగైనా అడుగుపెట్టాలని చూస్తున్న బీజేపికి భంగపాటు తప్పదు. ఇటు తమిళనాడులో కూడా దాదాపు అంతే. ఇకపోతే, తమిళనాడులో ప్రజలు పాటించే సాంప్రదాయాన్ని మన తెలుగు ప్రజలు కూడా పాటించాలి అనుకుంటే.. 2019 ఎన్నికలలో ప్రజలు ఎవరికీ ఓటు వేస్తారు అనే విషయంపై ఇప్పటికే కొన్ని సర్వేలు జరిగాయి. ఇప్పుడున్న తాజా రాజకీయ పరిస్థితులలో చంద్రబాబు కంటే కూడా వైఎస్ జగన్ కు ఆదరణ ఉన్నట్టు కనిపిస్తున్నది. అయితే, ఈ ఆదరణ కంటిన్యూగా ఉంటుంది అని చెప్పలేం.

ఇక వచ్చే ఎన్నికలలో ప్రత్యక్షంగా రాజకీయాలలోకి అడుగుపెట్టాలని జనసేన అనుకుంటున్నది. ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్స్ చేస్తున్నారు. జనసేన ప్రజలలోకి వెళ్ళిన తరువాత వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉన్నది అనే దానిబట్టి పవన్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. తమిళనాడులో మాదిరి ప్రజలు మార్పును కోరుకోవాలి. ఎప్పుడు ఒకే పార్టీని కాకుండా మిగతా పార్టీలకు కూడా అవకాశం ఇవ్వాలి. అప్పుడే పనులు జరుగుతాయి. ఓటుబ్యాంకు రాజకీయాలు, కులరాజకీయాలను పక్కన పెట్టి నిజమైన అభివృద్ధి కావాలనుకుంటే ప్రజలు మారాలి. అప్పుడే నాయకులు మారతారు. లేదంటే అభివృద్ధికి ఆమడదూరమే.