పవన్ పై అప్పుడే లెక్కలు మొదలయ్యాయట.. 2009 రిపీట్ కాదు కదా..!?

Tuesday, April 19th, 2016, 08:22:27 AM IST


జనసేన అధ్యక్షుడు 2019 ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్పడంతో తెలుగు రాష్ట్రాలలోని రాజకీయాలలో చాలా మార్పులు వచ్చాయి.. వస్తున్నాయి.. రాబోతున్నాయి కూడా. పవన్ పార్టీ జనసేన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందింది. అంటే తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు అవకాశం చిక్కింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంఛి కూడా పోటీ చెయ్యొచ్చు. మొదట్లో జనసేన కేవలం తెలంగాణ నుంచి మాత్రమే పోటీ చేస్తుంది అనుకున్నా.. తాజాగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ శాతం పోటీ చేస్తుందని తెలుస్తున్నది.

ఇక పవన్ పార్టీ పోటీలోకి దిగితే.. ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు..పొత్తు పెట్టుకుంటుందా లేదా.. పొత్తులు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతుందా.. ఒకవేళ ఒంటరిగా బరిలోకి దిగితే గెలిచే సామర్ధ్యం ఉన్నదా.. అనే విషయాల గురించే ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నది. కాని, ఇప్పటి నుంచే అంచనాలు భారీగా జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, 2018 నాటికి పవన్ రాజకీయాలోకి వస్తా అన్నప్పటికీ.. ఇప్పటి నుంచే పవన్ ప్రజలలోకి వెళ్ళాలి. లేదంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.

ఇకపోతే, 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ప్రచారం చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికలలో ప్రజారాజ్యం కేవలం 18 సీట్లు మాత్రమే గెలుచుకున్నది. బారీ అంచనాలతో బరిలోకి దిగిన ప్రజారాజ్యం 18 సీట్లు మాత్రమే గెలుచుకొని ఫర్వాలేదు అనిపించినా.. తరువాత కాలంలో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో కలిపేశారు. అలా కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం ను కలిపేయడంతో ప్రజలకు రాజకీయాలపై కాస్త విరక్తి కలిగిన మాట వాస్తవమే. అందుకే కొత్త పార్టీలను నమ్మేపరిస్థితి కనిపించడంలేదు.

పవన్ కళ్యాణ్ పక్కా కాంగ్రెస్ వ్యతిరేఖి. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ లో ఉన్న అన్నయ్య చిరంజీవి రాజకీయంగా శతృవు అని ఇప్పటికే పవన్ ప్రకటించాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాలు కూడా పవన్ కు నచ్చకపోవడంతో.. ఒంటరిగానే పోటీ చేయనున్నారు. పవన్ ఉద్దేశ్యాలు, భావాలు బాగున్నా.. వాటిని ప్రజలలోకి తీసుకెళ్ళి చైతన్య వంతులను చేయగలిగినపుడే అవి ఉపయోగపడతాయి. సినిమాలలో ఎలాగైతే ట్రెండ్ సృష్టించాడో.. రాజకీయాలలో కూడా పవన్ ట్రెండ్ సృష్టించగలుగుతాడు.