స్వచ్చభారత్ లో ఫోటోలకు ఫోజులేనా ?

Tuesday, November 11th, 2014, 12:11:14 PM IST


ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చభారత్ ఇప్పుడు దేశమంతా పాకింది. దేశాన్ని పరిశుభ్రం చేయడం కోసం సెలెబ్రెటీలు కూడా రంగంలోకి దిగారు. ఒకరిని మించి మరొకరు.. రోడ్లపైకి చేరుకొని.. చీపురు పట్టుకొని చెత్త ఊడ్చేస్తున్నారు. మీడియా కూడా వారికి మంచి పబ్లిసిటీ ఇస్తున్నది. ఇంతవరకు బాగానే ఉన్నది… కాని, చీపురు పట్టుకొని చెత్త ఊడుస్తున్న సెలెబ్రెటీలు ఎంతవరకు ఆ పని చేస్తున్నారన్నదే ఇప్పుడు అసలు పాయింట్.

చీపురు పట్టుకొని చెత్త ఊడుస్తున్న ఈ సెలెబ్రెటీలు మీడియా కెమెరాలు ఉన్నంత సేపే పనిచేస్తున్నారన్నది అసలు నిజమని తెలుస్తున్నది. నిజానికి స్వచ్చభారత్ కార్యక్రమం కోసం సమయం కేటాయిస్తే కనీసం ఆ రోజంతా పనిచేయాలి. మీడియా కోసం అన్నట్టుగా ఓ ఐదు లేక పది నిమిషాలు పని చేస్తే వారు పనిచేసినట్టు ఎలా అవుతుంది? పబ్లిసిటీ కోసం కాకుండా స్వచ్చందంగా రోజంతా పనిచేస్తున్న సెలెబ్రెటీలు ఎందరు? మోడీ ఆశయం నెరవేరాలంటే.. గాంధీజీ కన్న కల నెరవేరాలంటే.. నిజాయితీగా స్వచ్చభారత్ కార్యక్రమంలో పాల్గొనాలి.