పొలిటికల్ పవర్ గేమ్ లో.. పవన్ సక్సెస్ అవుతాడా..?

Sunday, May 8th, 2016, 03:49:09 PM IST


ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ వార్ మొదలైంది. పార్టీలన్నీ ఎవరికీ వారు జాగ్రత్తపడుతున్నారు. ఎందుకంటే.. కేంద్రం విసిరిన ప్రత్యేక హోదా దెబ్బకు అన్ని పార్టీలకు దిమ్మతిరిగిపోయింది. ఎవరు ఇప్పుడు ప్రజలలోకి వెళ్ళాలన్న భయపడే స్థితివచ్చింది. ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇప్పుడు ఏమని బదులు ఇవ్వాలో పాలుపోవడంలేదు. ప్రజలలోకి వెళ్తే ఏమంటారో అని ఒక భయం తెలుగుదేశం పార్టీ నేతలలోపల ఉన్నది.

ఇక, కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి అనంతపురం ఎంపిగా గెలుపొందిన జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. ఎవరు వచ్చినా, ఎన్ని పోరాటాలు చేసినా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావడం కల్లా అని అంటున్నాడు. తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలే ఒకరు ఒకలా, మరొకరు మరోలా చెప్తూ ప్రజలను తికమక పెడుతున్నారు.

ఇక, ప్రత్యేక హోదా రాదనీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ముందుగానే తెలుసా అంటే.. తెలిసే ఉండొచ్చు. బహుశా , ప్రత్యేక హోదా విషయంలో అదే ధోరణిలో ఉండటంతో.. పవన్ బయటకు వచ్చి.. వచ్చే ఎన్నికలలో ప్రత్యక్షంగా పోటీ చేస్తానని చెప్పిఉండాలి. అయితే, 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడువంటి మహానాయకుడిని పవన్ కళ్యాణ్ పవర్ పాలిటిక్స్ లో అడ్డుకొని ఎంతవరకు నిలబడగలరు. ఎన్నికలలో విజయం సాధించాలి అంటే.. ప్రజలకు హామీలు ఇవ్వాలి, అవతలి పార్టీల ఎత్తులకు పైఎత్తులు వేయాలి. 64 గళ్ళ పొలిటికల్ చదరంగంలో 128 ఎత్తులు ముందుగానే ఆలోచించి వేయగల సత్తా ఉన్నప్పుడే పొలిటికల్ రంగంలో రాణించగలరు. మరి పవన్ లో ఆ సత్తా ఉన్నదా..!