2019 కోసం ఇప్పటి నుంచే ఎత్తులా.. జూనియర్ పేరు మరోసారి తెరపైకి వస్తుందా..?

Tuesday, April 12th, 2016, 12:20:05 PM IST


2019 లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. 2019 అంటే ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉన్నది. ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయాలలో కాంపిటీషన్ పెద్దగా ఉండేది కాదు. ఉన్న పార్టీల విభేదాలు ఉన్నా.. అవి అంతగా బయటకు వచ్చేవి కాదు. పైగా అప్పట్లో మీడియా ప్రభావం కూడా పెద్దగా లేదు. కాబట్టి పార్టీలలో ఏం జరిగినా బయటకు తెలిసేది కాదు.

అయితే, ఇప్పుడు అంతా మారిపోయింది. పార్టీలోపల ఏం జరుగుతుందో.. ఏం జరగబోతున్నదో.. అవతలి పార్టీకంటే ముందే మీడియాకు తెలిసిపోతున్నది. మీడియాలో దానికి సంబంధించిన వార్తలు రాగానే పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. దానికి తగిన విధంగా ఎత్తులు వేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే, వచ్చే ఎన్నికల కోసం అన్ని పార్టీ ఇప్పటి నుంచే సిద్దం అవుతున్నాయి. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని వైకాపా చూస్తుంటే.. బలం పుంజుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. ఇక బీజేపి కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నది. 2019 లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా పోటీకి దిగుతుండటంతో పోటీ మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తున్నది.

ఇక అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎత్తులు ఎవరికీ అర్ధం కావడం లేదు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ను ప్రత్యక్ష రాజకీయాలోకి తీసుకొచ్చారు. ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ ను నియమించారు. వచ్చే ఎన్నికల నాటికి లోకేష్ ను అన్ని రకాలుగా సిద్దం చేయాలన్నది బాబు ప్లాన్. అందుకోసమే.. లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే, ఎంతమంది ఎంత ప్రచారం చేసినప్పటికీ కూడా 2009 లో జూనియర్ చేసిన ప్రచారానికి వచ్చినంత క్రేజ్ మరే ప్రచారానికి రాలేదు. అప్పట్లో రాజకీయ వారసత్వంపై చర్చలు కూడా జరిగాయి. దీంతో ఎన్టీఆర్ ను పక్కన పెట్టి లోకేష్ ను లైన్లోకి తెచ్చారు. తరువాత హరికృష్ణను కూడా పక్కన పెట్టారు. వచ్చే ఎన్నికల సమయంలో హరికృష్ణ తెలుగుదేశం పార్టీ వారసత్వం విషయాన్ని లేవనెత్తే అవకాశం ఉన్నది.

అప్పుడు తప్పకుండా జూనియర్ పేరు మరలా తెరపైకి వస్తుంది అనడంలో సందేహం లేదు. ఆ సమస్య తలెత్తకుండా ఉండేందుకు చంద్రబాబు ఇప్పటినుంచే ఎత్తులు వేస్తున్నారని తెలుస్తున్నది. అందుకే పార్టీలోకి ఇతర పార్టీల నాయకులను ఆహ్వానిస్తూ తెలుగుదేశం పార్టీని బలపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే, ఇందులో భాగంగానే బాలకృష్ణను ఎమ్మెల్యేను చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. లోకేష్ బాలకృష్ణ అల్లుడు కాబట్టి.. వచ్చే ఎన్నికల సమయంలో లోకేష్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తే.. బాలకృష్ణ సపోర్ట్ చేయవచ్చని మరికొందరి వాదన. క్రికెట్ లో బంతిని ఎవరైతే బలంగా కొడతారు వారిదే గెలుపు అన్నట్టుగా, రాజకీయంలో ఎవరైతే ఎత్తులు వేస్తారో వారికే ప్రజలు పట్టం కడతారు అన్నది సత్యం. చూద్దాం ఏం జరుగుతుందో.. ఎలా జరుగుతుందో.