రోజా సారి చెప్తుందా లేదా..?

Wednesday, April 6th, 2016, 10:18:03 AM IST


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత రోజా ఈరోజు మధ్యాహ్నం ప్రివిలేజ్ కమిటీ ముందుకు రానున్నారు. తెలుగుదేశం పార్టీ మహిళా నేత అనిత ప్రివిలేజ్ కమిటీలో ఫిర్యాదు చేసింది. అనిత ఇచ్చిన ఫిర్యాదుతో రోజాకు నోటీసులు జారీ చేశారు. రోజా అసెంబ్లీ సభ్యులపైన, ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా అలాగే, స్పీకర్ కోడెలపైన అనుచిత వ్యాఖ్యలు చేసిందని అనిత ప్రివిలేజ్ కమిటీలో రిపోర్ట్ చేసింది. అయితే, రోజాకు గతంలో ప్రివిలేజ్ కమిటి నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదు. అయితే, అప్పట్లో సుప్రీం కోర్టుకు, హై కోర్టుకు తిరుగుతుండటం వలన హాజరుకాలేకపోవడంతో ఈనెల 6 వ తేదీన హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ పేర్కొన్నది.

ఇక ఈరోజు రోజా ప్రివిలేజ్ కమిటీ ముందుకు వెళ్ళబోతున్నది. రోజాపై సంవత్సరం పాటు సభనుంచి సస్పెండ్ చేసినదానిపైన అలాగే, అనిత ఇచ్చిన ఫిర్యాదుపైన రోజా కమిటీ ముందు వివరణ ఇస్తారు. ఈ కమిటీలో రోజా సారీ చెప్తే.. ఆమె సస్పెండ్ పై కమిటీ ఆలోచించే అవకాశం ఉన్నది. కాని, రోజా సారీ చెప్పేందుకు సిద్దంగా లేరని సమాచారం. మరి కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఈరోజు తేలిపోతుంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రోజా కమిటీ ముందు హజరవుతారు.