ఏపీ పొలిటికల్ కారిడార్ సహా తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే ధ్యేయంగా వైకాపా అధినేత వైయస్ జగన్‌తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి పోటీ చేస్తారన్నదే ఆ చర్చ. అయితే ఇది ఎంతవరకూ నిజం? జగన్‌తో పవన్ కలుస్తారా? పవన్‌ని కలుపుకునేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారా? అంటే ఇదేదీ అంత పాజిబుల్గా కనిపించలేదన్నది ఒక వర్గం ప్రచారం.
అయితే వైరి వర్గాలు అయినా జగన్, పవన్ ఇద్దరినీ కలిపేందుకు మెగా ఫ్యామిలీకి, చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన బొత్స సత్యనారాయణ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో చిరు సైతం జగన్‌కి వ్యతిరేకి అయిన పవన్‌ని మెత్తబరిచేందుకు ప్రయత్నిస్తున్నారన్న మాటా వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో చంద్రబాబును గద్దె దించడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారని, రాజకీయాల్లో ఆకస్మికంగా ఏం జరగేందుకైనా ఛాన్సుందని ప్రచారం సాగుతోంది. జనసేన నుంచే వైకాపాకు ప్రతిపాదనలు వచ్చాయి అంటూ వైయస్సార్సీపీ ప్రతినిధులు, నాయకులు ప్రచారం సాగిస్తున్నారు. ఇక జనసేనతో కలిస్తే వైకాపాకు దెబ్బ పడడం ఖాయమని, చంద్రబాబు ప్రభుత్వం దిగిపోవడం ఖాయమని కూడా ప్రచారం సాగుతోంది. మరోవైపు చంద్రబాబు, జగన్‌ని మించి జనాల్లోకి దూసుకెళ్లిపోతున్న పవన్ వల్ల తమకు ఎప్పటికైనా ముప్పు తప్పదని అధికార, ప్రతిపక్ష నాయకులు భావిస్తున్నారన్న ప్రచారం ఉంది. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో జనసేనాని కలకలం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.