ఫేక్ పేటియం యాప్ మోసాలతో బురిడీ కొట్టిస్తున్న యువకులు!

Monday, April 30th, 2018, 05:13:11 PM IST

గత కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ మహానగరం లోని ఒక ప్రముఖ రెస్టారెంట్ లో జరిగిన ఒక చెల్లింపుల ఘటన వింటే ఆశ్చర్యపోక తప్పదు. కొందరు యువకులు కొత్తపేట లోని ఒక ప్రముఖ రెస్టారంట్ కు వెళ్లి రూ.1000 విలువగల ఫుడ్ ఆర్డర్ చేసి నగదును పేటియం ద్వారా చెల్లించి, ధ్రువీకరణ మెసేజీని ఓనర్ కు చూపి వెళ్లిపోయారు. అయితే ఎంతసేపటికి ఓనర్ పేటియం అకౌంట్ కు డబ్బు జమ కాకపోవడంతో ఖంగుతిన్న అతడు ఆ యువకులు చేసిన పనికి తల పట్టుకున్నాడు. అలానే బోడుప్పల్, బాల నగర్ తదితర ప్రాంతాల్లోనూ ఇటువంటి పేటియం మోసాలు జరిగాయని తెలుస్తోంది.

నిజానికి ఆ యువకులు చూపినది “స్పూఫ్ పేటియం” అకౌంట్ తాలూకు చెల్లింపు మెసేజి అన్నమాట. అచ్చం ఒరిజినల్ పేటియం ను మాదిరి వుండే ఆ యాప్ ద్వారా కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు చెల్లింపులు చేస్తూ పోలీస్ ల కంట పడ్డారు. అయితే పోలీస్ లు వారికి ఇటువంటివి మళ్లి చేయవద్దని మందలించి వదిలేసినట్లు తెలుస్తోంది. పెద్దమొత్తం లో అయితే కేసు అవుతుందని చెల్లింపులను రూ.1000 లోపు చేస్తున్నారట. వ్యాపారులు కూడా చిన్నమొత్తాలు కావడంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి జంకుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటువంటివి బెంగుళూరు, ముంబై లలో జరిగినప్పటికీ కాస్త ఎక్కువగా హైదరాబాద్ లోనే జరుగుతున్నాయని ఇటువంటి చెల్లింపుల పట్ల వ్యాపారాలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ లు అంటున్నారు.

నిజానికి అచ్చం పేటియం ను పోలిన ఈ ‘స్పూఫ్ పేటియం’ యాప్ కొద్దిరోజుల క్రితం వరకు ప్లే స్టోర్ లో అందుబాటులో ఉండేది, అయితే ఈ తరహా మోసాలు జరగడం తమ దృష్టికి రావడంతో ప్లే స్టోర్ దీన్ని తొలగించిందని, కానీ ఇది ప్రస్తుతం ఏపీకే రూపంలో ఇంకా ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరైనా పేటియం ద్వారా చెల్లింపులు చేస్తే నగదు తమ ఖాతాకు బదిలీ అయ్యాకే సరుకు డెలివరీ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇటువంటి ఘటనల పై పూర్తి బాధ్యత ఆ వ్యాపార సంస్థల ఓనర్ ల దే అని పోలీస్ లు అంటున్నారు. కావున ఇకపై ఇటువంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే తమకు ఫిర్యాదు చేయాలని పోలీస్ లు చెపుతున్నారు…..