‘బాహుబలి’లా ‘అమరావతి’ సినిమా అట!

Tuesday, July 21st, 2015, 01:27:09 PM IST


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ‘బాహుబలి’, ‘మగధీర’ సినిమాల లాగ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ‘అమరావతి’ మాస్టర్ ప్లాన్ ను సినిమా చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. అలాగే ఓటుకు నోటు, పుష్కర తొక్కిసలాట ఘటనలలో ప్రజలు తన పాత్రను మర్చిపోవాలనే చంద్రబాబు రాజధాని ప్రణాళిక వీడియోను పదేపదే చూపెడుతున్నారని రోజా మండిపడ్డారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ రాజధాని ప్రణాళికలో సామాన్యులకు చోటెక్కడ కల్పించారని నిలదీశారు. అలాగే పుష్కరాలలో ప్రచారం కోసం జనాన్ని పోగు చేసి, సినిమా తీయించడానికి ప్రయత్నించి తొక్కిసలాట జరగడానికి చంద్రబాబు కారణమయ్యారని రోజా ధ్వజమెత్తారు. ఇక ఇప్పుడు దానిని కప్పి పుచ్చుకునేందుకే బాబు రాజధాని వీడియోలను చూపెడుతున్నారని, ఆయన సినిమా చూసి టిడిపి కార్యకర్తలో, ఒక సామజిక వర్గమో సంతోషించినా ప్రజలకు మాత్రం ఎటువంటి ఉపయోగం లేదని రోజా నిప్పులు చెరిగారు.