ఏపీలో వైసీపీకి ఏమైంది..?

Monday, February 22nd, 2016, 10:36:08 AM IST


ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి గడ్డు రోజులు మొదలైనట్టు కనిపిస్తోంది. పార్టీలోని పలువురు కీలక నేతలు పార్టీని వీడి అధికార పార్టీలోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారని బలమైన వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ ఇద్దరు పార్టీని వీడి అధికార టీడీపీలోకి వెళతారని అందరూ అనుకున్నారు. వైసీపీ ఈ వార్తలను ఖండించినా.. పరిస్థితి చూస్తుంటే టీడీపీలో భూమా చేరిక దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు చంద్రబాబు కర్నూలులో భూమాకు రాజకీయ ప్రత్యర్థులైన శిల్ప సోదరులతో కూడా చర్చలు జరిపి వారిని కూడా ఒప్పించినట్లు తెలుస్తోంది.

మరో వైపు కడప వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సైతం పార్టీని వీడతారని వస్తున్న వార్తలతో వైసీపీ శ్రేణుల్లో మరింత గందరగోళం మొదలైంది. వైసీపీ నేతలు పైకి ఎవరూ పార్టీని వీడటంలేదని.. అదంతా టీడీపీ చేస్తున్న విష ప్రచారమని చెబుతున్నా ఆంతరంగిక చర్చల్లో మునిగిపోయి.. ఎమ్మెల్యేలను బుజ్జగించే పనుల్లో పడిపోయారన్నది వాస్తవం. ఇదంతా బాబు ఆపరేషన్ ఆకర్ష్ మహిమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఎమ్మెల్యేలంతా ఇప్పటికిప్పుడే పార్టీ మారకపోయినా.. ఇంకో రెండు నెలల్లో ఈ చేరికలన్నీ పూర్తవుతాయని తెలుస్తోంది. ఇదే గనక జరిగితే బలంగా ఉన్న ప్రతిపక్షం వైసీపీ కుంగిపోవడం ఖాయం.