చెన్నై ఎయిర్ పోర్టులో అరెస్ట్ అయిన YSRCP ఎంపీ

Sunday, January 17th, 2016, 10:09:28 AM IST

mithun-reddy
వైసీపీ పార్టీకి చెందిన రాజం పేట ఎంపీ మిథున్ రెడ్డిని ఈ అర్థరాత్రి 2 గం. లకు చెన్నై ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు. ఇతనితోపాటు ఉన్న మధుసూదన్ రెడ్డిని కూడా అరెస్టు చేసి శ్రీకాళహస్తి పీఎస్ కు తరలించారు. గత ఏడాది మిధున్ రెడ్డి రేణిగుంట ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా మేనేజర్ రాజశేఖర్ పై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన హైకోర్టులో బెయిల్ అప్లై చేయగా అక్కడ ఆయనకు బెయిల్ నిరాకరించబడింది. దీంతో ఆయన సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా అక్కడ కూడా బెయిల్ తిరస్కరణకు గురికావడంతో పోలీసులు ఈ రోజు అర్థరాత్రి 2 గం. ల సమయంలో చెన్నై ఎయిర్ పోర్టులో ఉన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

ఈరోజు ఉదయం కొద్దిసేపటి క్రితమే మిథున్ రెడ్డిని శ్రీకాళహస్తి జడ్జి ఇంట్లో హాజరుపర్చగా 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాలని జడ్జి ఆదేశించారు. కాసేపటి క్రితమే మిధున్ రెడ్డిని విచారణ కోసం ఏర్పేడు పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. దీంతో చిత్తూరు, కడప జిల్లాల్లో ఉన్న వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనను ముందుగానే ఊహించిన పోలీసులు 144 సెక్షన్ విధించి.. పలువురు కీలక వైసీపీ నేతల నివాసాల ముందు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మిథున్ రెడ్డి అరెస్టుకు నిరసనగా వైసీపీ నేతలు ఆందోళన చేస్తూ ఇదంతా అధికార పార్టీ కక్ష సాదింపు చర్యేనని ఆరోపించారు.

వీడియో కోసం క్లిక్ చేయండి: