ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 29న 2.ఓ (రోబో2) రిలీజవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం రిలీజైన రోబో చిత్రం అప్పట్లోనే 40 కోట్లు వసూలు చేయడంతో ప్రస్తుతం 2.ఓ ఏకంగా 100కోట్లు పైగా కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ సినిమా రైట్స్ కోసం ఓ రెండు వర్గాల మధ్య తీవ్రమైన హోరాహోరీ నడుస్తోందని తెలుస్తోంది.
2.ఓ తెలుగు రైట్స్ ను గత ఏడాది ఏషియన్ సునీల్ నారంగ్ ఛేజిక్కించుకున్నారు. అతడితో డి.సురేష్‌బాబు- రిలయన్స్ సంస్థలు జతకట్టి రైట్స్‌ని కొనుక్కులే ప్లాన్ వేశారు. కానీ 2.ఓ రిలీజ్ వాయిదాలతో కంగారు పడి అడ్వాన్సులు వెనక్కి తీసుకున్నారు. అయితే లైకా సంస్థ అడ్వాన్సుల్లోనే 13కోట్లు వెనక్కి ఇవ్వకుండా పెండింగులో పెట్టిందిట. దీంతో ఇప్పుడు రైట్స్ ఎన్ వి ప్రసాద్ చేతికి మారాయని వార్తలు వస్తున్నా, ఇంకా పీటముడి విడలేదని తెలుస్తోంది. ఏషియన్ సునీల్ నారంగ్‌కి 13 కోట్లు, దానిపై వడ్డీని లైకా సంస్థ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కానీ వడ్డీ లేకుండా ఆ 13కోట్లు మాత్రమే చెల్లించాలని వారు భావిస్తున్నారట. అయితే ఏషియన్ నారంగ్ బృందం ఇంకా 2.ఓ హక్కులు తమ వద్దనే ఉన్నాయని, రిలీజ్ చేసే రైట్స్ తమకే చెందుతాయని భావిస్తున్నారట. లైకా సంస్థతో విభేధాల్ని పరిష్కరించేందుకు ఎన్.వి.ప్రసాద్‌ని పురమాయిస్తే, ఆయన దిల్‌రాజు- యు.వి.క్రియేషన్స్ బృందాన్ని కలుపుకుని తెలివిగా రైట్స్ విషయంలో పావులు కదిపారట. దీంతో ఆ ఇరు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ పంచాయితీ తేలి చివరికి ఎవరు రిలీజ్ చేస్తారు? అన్నదానిపై సందిగ్ధత నెలకొందని చెబుతున్నారు. 2.ఓ విషయంలో ఇరువర్గాలు గట్టి పట్టుమీదనే ఉన్నాయిట. అదీ సంగతి.