రివ్యూ ‘రాజా’ తీన్‌మార్ : అప్పట్లో ఒకడుండేవాడు – పాత్రల పోరాటంలో ఎమోషన్ ఉంది !

Friday, December 30th, 2016, 03:53:24 PM IST


తెరపై కనిపించిన వారు : శ్రీ విష్ణు, నారా రోహిత్, తాన్య హోప్

కెప్టెన్ ఆఫ్ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ : సాగర్ కె చంద్ర

మూల కథ :

అప్పుడప్పుడే క్రికెటర్ గా ఎదుగుతున్న రైల్వే రాజు (శ్రీ విష్ణు) తన సోదరి వలన నక్సల్స్ కు సంబందించిన కేసులో చిక్కుకుంటాడు. ఆ కేసును ఇబ్రహీం ఖాన్ (నారా రోహిత్) అనే టఫ్ పోలీస్ ఆఫీసర్ హ్యాండిల్ చేస్తూ రైల్వే రాజును బాగా ఇబ్బందిపెడుతుంటాడు.

అలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాజు ఆ ఇబ్బందుల నుండి తప్పించుకునే క్రమంలో పెద్ద నేరం చేసి జైలుకు వెళతాడు. తాను జైలుకు వెళ్ళడానికి కారణమైన పోలీస్ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని డిసైడవుతాడు రైల్వేరాజు. అలా నిర్ణయం తీసుకున్న రాజు ఇబ్రహీం ఖాన్ ను ఎలా ఎదుర్కున్నాడు అనేదే తెరపై నడిచే సినిమా.

విజిల్ పోడు :

–> సినిమాలో హీరో వేరే వ్యక్తి అయినా కూడా నారా రోహిత్ కథను నమ్మి దానికి సపోర్ట్ చేసి సినిమాలోని కీలక పాత్రను చేసి సినిమాను ముందుకు నడిపినందుకు అతనికి ఒక విజిల్ వేసుకోవాల్సిందే.

–> అలాగే కథలోని ముఖ్య పాత్రలు రైల్వే రాజు, ఇబ్రహీం ఖాన్ పాత్రల్లో గొప్పగా నటించి సినిమాకు ప్రాణం పోసిన నారా రోహిత్, శ్రీ విష్ణులకు రెండవ విజిల్ వేయొచ్చు.

–> రెగ్యులర్ స్టోరీలకు భిన్నంగా కథను తీసుకుని దానికి బలమైన కథనాన్ని రాసుకుని అంతే బలంగా తెరపై ఆవిష్కరించి ఆసక్తిగా సాగే ఫస్టాఫ్, మంచి క్లైమాక్స్ ఇచ్చిన దర్శకుడు సాగర్ కె చంద్రకు మూడవ విజిల్ వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమా విడుదలకు ముందు అందులో నారా రోహితే అసలు హీరో అనుకుని సినిమాకి వెళ్లిన ప్రేక్షకులకు తీరా సినిమా చూశాక రోహిత్ అతిధి పాత్ర మాత్రమే చేసాడని తెలీడం నిరుత్సాహానికి గురిచేసింది.

–> ఇక ఫస్టాఫ్ ను అద్భుతంగా నడిపి సెకండాఫ్ ను క్లైమాక్స్ మినహా చాలా చోట్ల బలహీనంగా చేశారు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..!

–> అనుకోని పరిస్థితుల్లో నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన రాజు పాత్ర అనూహ్యంగా అంత సులభంగా ఎలా ఎదిగిందో ఆశ్చర్యకరంగానే ఉంటుంది.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల సంభాషణ ఇలా ఉంది..

మిస్టర్ ఏ : సినిమా కొత్తగా ఉంది కదరా !
మిస్టర్ బి : అవును స్టోరీ, స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ అదుర్స్ అంతే.
మిస్టర్ ఏ : కానీ సెకండాఫ్ కొంచెం డల్ అయింది.
మిస్టర్ బి : అవును. అయినా కూడా పాత్రలు చేసే ఆ ఫైట్ లో ఒక ఎమోషన్ ఉందిలే.