తెరపై కనిపించిన వారు : సాయిరామ్ శంకర్, నిఖిషా పటేల్
కెప్టెన్ ఆఫ్ ‘అరకు రోడ్లో’ : వాసుదేవ్
మూలకథ :
అరకుకు వెళ్ళే రోడ్లో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ హత్యలకు ఏమాత్రం సంబంధం లేని హీరో పోతురాజు (సాయిరామ్ శంకర్), అనుకోని పరిస్థితుల్లో ఆ హత్యలు చేసే వ్యక్తితో ప్రయాణం చేయాల్సి వస్తుంది. అతడికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? దాన్నుంచి ఎలా బయటపడ్డాడన్నదే సినిమా.
విజిల్ పోడు :
1. సరదాగా సాగిపోతోన్న ఓ కుర్రాడి జీవితం ఒక్క సంఘటనతో అనుకోని మలుపు తీస్కోవడం, ఒక సీరియల్ కిల్లర్‌తో ప్రయాణించాల్సి రావడం లాంటి అంశాలున్న ప్రధాన కథ ఈ సినిమాకు బలమనే చెప్పాలి. ఇలాంటి కథతో సినిమా తీయాలన్న ఆలోచనను అభినందించొచ్చు.
2. ఇంటర్వెల్ తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు సినిమా థ్రిల్లింగ్‌గా నడిచి బాగా ఆకట్టుకుంటుంది. ఇలాగే గనక సినిమా మొత్తం ఉండి ఉంటే కథ వేరేలా ఉండేది.
3. సాయిరామ్ శంకర్ తన ఎనర్జీతో బానే సినిమాను నడిపించాడు. ఇలా పూర్తి స్థాయిగా హీరోగా కొత్తదనమున్న సినిమాలు చేస్తే బాగానే మెప్పించగలడనిపించింది.
ఢమ్మాల్ – డుమ్మీల్ :
1. ఫస్టాఫ్‌ను అతిపెద్ద ఢమ్మాల్గా చెప్పుకోవాలి. అన్ని సన్నివేశాలూ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా, అదేదో వచ్చాయంటే వచ్చాయన్నట్టుగా ఉన్నాయి. అందులోనే ఇంటర్వెల్ మటుకు ఢమ్మాల్ స్థాయిని కొంచెం తగ్గించేలా ఉంది.
2. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అయితే అస్సలు బాగోలేవు. సీరియల్ కిల్లర్ ఎవరి వెంట ఎందుకుపడతాడో, రిస్క్ రసూల్ అంటూ పృథ్వీ కామెడీ ఏంటో, ఇంతసేపూ బానే నడిచింది కదా సినిమా అనేంత ఢమ్మాల్ ఈ సన్నివేశాలు.
3. ఆ సీరియల్ కిల్లర్ కథేంటో చెప్పకపోవడం మరీ దారుణంగా ఉంది. సినిమానంతా అతడి హత్యల చుట్టూనే తిప్పి చివర్లో అతడి కథేంటన్నది కూడా పట్టించుకోకపోవడం ఢుమ్మీల్.
దావుడా – ఈ సిత్రాలు చూశారూ ..!!
–> హీరో ఎలాంటోడైనా హీరోయిన్ అతడికి ఇలాగే పడిపోతుంది. మళ్ళీ ఈ సినిమాల్లో హీరోయిన్ చేసేది కూడా ఏమీ ఉండదు. అలాంటప్పుడు హీరోయిన్లను తీసుకొచ్చి ఎందుకు అనిపించేంత సిత్రంగా నిఖిషా పటేల్ రోల్ ఉందీ సినిమాలో!
–> పోలీసులకే తలనొప్పిగా తయారైన కిల్లర్, నిజంగానే అంత భయపెట్టేలా ఉన్నాడా అంటే అంత సీన్ లేదనే అనాలి. కొంచెమైనా భయం పుట్టించేలా ఈ పాత్రను డిజైన్ చేయాల్సింది.
–> చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల సంభాషణ ఇలా ఉంది..
మిస్టర్ ఏ : అరకు రోడ్లో అన్నీ గుంతలే ఉన్నాయి కదరా!?
మిస్టర్ బీ : అదే కదా! కొన్నిచోట్ల రోడ్ బానే ఉంది కానీ, కూర్చోలేకపోయా!
మిస్టర్ ఏ : అబ్బా!! నేనైతే కిందా, మీదా పడుతూ బయటకొచ్చా.