రివ్యూ రాజా తీన్‌మార్ : బాబు బాగా బిజీ – చెప్పిందొకటి.. చూపించిందొకటి

Friday, May 5th, 2017, 06:20:26 PM IST


తెరపై కనిపించిన వారు : శ్రీనివాస్ అవసరాల, మిస్తి చక్రబర్తి, తేజశ్వి మదివాడ

కెప్టెన్ ఆఫ్ ‘బాబు బాగా బిజీ’ : నవీన్ మేడారం

మూల కథ :

యవ్వన దశ ఆరంభం నుండి అమ్మాయిలు, శృంగారం అంటే అమితాసక్తి పెంచుకున్న కుర్రాడు మాధవ్ (శ్రీనివాస్ అవసరాల) పెద్దయ్యేసరికి అనేక మంది ఆడవాళ్ళతో సంబంధాలను కలిగి ఉంటాడు. అలా అతను రిలేషన్ కలిగి ఉన్న ఆడవాళ్ళలో ఒకరైన చంద్రిక (సుప్రియ) ద్వారా సమస్యల్లో పడే మాధవ్ ఇకనైనా మంచిగా మారి పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు.

అలా మాధవ్ మారాలనుకోవడానికి కారణం ఏమిటి ? చివరికి మారాడా ? తను పెళ్లి చేసుకుందామనుకున్న రాధ (మిస్తి చక్రబర్తి) ని పెళ్లి చేసుకున్నాడా ? అనేదే సినిమా కథ.

విజిల్ పోడు :

–> సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది కీ రోల్ చేసిన శ్రీనివాస్ అవసరాల. ఇన్నోసెంట్ ప్లే బాయ్ గా ఆయన నటన చాలా బాగుంది. సినిమా మొత్తాన్ని తన నటనతో ముందుకు నడపాలని చూశాడు అవసరాల.

–> ఫస్టాఫ్లో హీరో తాలూకు చిన్ననాటి సన్నివేశాలు, అందులో ఇన్స్పెక్టర్ గా కనిపించే పోసాని కామెడీ కాస్తంత బాగున్నాయనిపించింది.

–> ఇక సినిమాలో కనిపించే ప్రతి సీన్ కలర్ ఫుల్ గా చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ ను డీటైల్డ్ గా తీశారు. దీంతో విజువల్స్ పరంగా చిత్రానికి మంచి న్యాయం జరిగింది.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్ అంటే ట్రైలర్లలో చెప్పినట్టు చిత్రంలో ఎలాంటి అడల్ట్ కామెడీ కంటెంట్ లేకపోవడం. హీరో, హీరోయిన్లకు మధ్య నడిచే సీన్లలో రొమాన్స్ కూడా పెద్దగా లేకపోవడం తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది.

–> ఫస్టాఫ్ ఆరంభం బాగానే ఉన్నా సమయం గడిచేకొద్ది కథనం చాలా మటుకు నెమ్మదించిపోయింది. దానికి తోడు దర్శకుడు నవీన్ మేడరం కథనాన్ని కాసేపు గతంలో, ఇంకాసేపు ప్రస్తుతంలో చెప్పడమనే విధానం బోరింగా అనిపించింది.

–> రొమాన్స్ ఎలాగూ లేదు కనీసం కామెడీ అయినా ఉందా అదీ లేదు. ప్రియదర్శి వంటి పాపులర్ కమెడియన్ ను ఊరికే అలా సీన్లలో చూపించారు తప్ప ఎక్కడా ఎఫెక్టివ్ గా వాడుకోలేదు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> ఈ సినిమా కథనం, తీసిన విధానం బాగోలేవు కానీ మరీ టూ మచ్ అనిపించే విచిత్రమైన సంఘటనలు, సీన్లు ఏమీ కనిపించలేదు.

చివరగా సినిమా చుసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ: సినిమా ముందు ఏం చెప్పావ్ ?
మిస్టర్ బి: నేనేం చెప్పాను !
మిస్టర్ ఏ: మంచి స్పైసీ సినిమా, ఎంటర్టైన్మెంట్ అదిరిపోద్ది అన్నావ్ కదా.
మిస్టర్ బి : నేను కూడా ట్రైలర్ చూసి అలానే ఉంటుందనుకున్నా.
మిస్టర్ ఏ: అంటే నువ్వు మోసపోవడమేకాక నన్ను కూడా మోసపోయేలా చేశావన్నమాట.
మిస్టర్ బి: నాకేం తెలుసు వాళ్ళు ఒకటి చెప్పి ఇంకొకటి చూపిస్తారని.