రివ్యూ రాజా తీన్‌మార్ : గౌతమిపుత్ర శాతకర్ణి – మంచి సినిమానే.. భీభత్సం మాత్రం కాదు !

Thursday, January 12th, 2017, 07:15:01 PM IST


తెరపై కనిపించిన వారు : బాలకృష్ణ, శ్రియ శరన్

కెప్టెన్ ఆఫ్ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ : జాగర్లమూడి క్రిష్

మూల కథ :

గౌతమిపుత్ర శాతకర్ణి చిన్నతనంలోనే దేశంలో ఉన్న రాజుల మధ్య యుద్దాలు జరగకూడదు, అలా జరగకుండా ఉండాలంటే దేశంలో ఉన్న అన్ని రాజ్యాలను కలిపి ఒకే మహా సామ్రాజ్యంగా చేసి తానే సుభిక్షంగా పాలించాలని సంకల్పించుకుని దేశంలోని అన్ని రాజ్యాలను జయిస్తూ చివరికి అనుకున్న ప్రకారం అఖండ భారత సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు.

ఆ క్రమంలో అతనికి, అతని భార్యకి మధ్య అభిప్రాయ బేధం ఏర్పడుతుంది. ఆ బేధం ఎలాంటిది ? పైగా రాజ్యం ఏర్పడ్డాక ఒక విదేశీ శత్రువు మూలాన అఖండ భారతానికి ముప్పు వాటిల్లుతుందని భావించి భవిషత్తు కోసం రాజ్యానికి బలమైన పునాదులు వేయాలని చరిత్రలో చివరి యుద్దానికి సిద్దమవుతాడు. ఇంతకీ ఆ శత్రువు ఎవరు ? అతన్ని శాతకర్ణి ఎలా ఎదిరించాడు ? శాతకర్ణి జైత్రయాత్ర ఎలా సాగింది ? అనేదే ఈ సినిమా కథ..

విజిల్ పోడు:
–> మనకు తెలియని మన గొప్ప చరిత్రను మనకు తెలియజెప్పాలనుకొన్న క్రిష్ ఆలోచనకు, కష్టపడ్డ తీరుకు మొదటి విజిల్ వేయొచ్చు. ఆయన చేసిన ప్రయత్నం గొప్ప చరిత్రను కళ్ళ ముందు ఆవిష్కృతం చేసింది.

–> ఇక నట సింహం బాలకృష్ణ అయితే ఆ శాతకర్ణి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి అద్భుతమైన రాజసం, వీరత్వం ప్రదర్శిస్తూ దుమ్ము లేపాడు కాబట్టి రెండో సోలో విజిల్ ఆయనకి వేయొచ్చు.

–> చివరి మూడో విజిల్ సినిమాకి అద్భుతమైన డైలాగులు రాసిన సాయి మాధవ్ బుర్రా, మంచి నటన కనబరిచిన శ్రియ శరన్, హేమా మాలినిలకు వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> చరిత్రకు సంబందించిన సినిమా అంటే కథ ఎలాగూ రాలేరు కాబట్టి కథనానైనా కాస్త ఉత్కంఠగా మోషన్ గా రాయాలి కానీ ఇక్కడ ఆశించిన స్థాయిలో ఎమోషన్ పండలేదు.

–> రాజులు, రాజ్యాలు, యోధుల చరిత్రలు చేప్పేటప్పుడు అందులో జరిగిన వాస్తవ యుద్దాలు ఆసక్తిగా సాగాలి. కథానాయకుడి గెలుస్తాడని తెలిసినా పోరాటం ఉత్కంఠగా సాగాలి కానీ ఇందులో అలాంటి ఉత్కంఠ ఏమీ దోరకలేదు.

–> చివరగా దర్శకుడు క్రిష్ నుండి ఎప్పుడూ కోరుకునే, ఆయన అందించే డ్రామా ఇందులో ఎక్కడా కనిపించలేదు. అంతా సాదాసీదాగా సాగిపోయింది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..!

–> ఇది చారిత్రిక అంశంతో తెరకెక్కిన చిత్రం కావడం వలన అలాంటి అంశాలేవీ ఇందులో తారసపడలేదు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు అభిమానుల సంభాషణ ఇలా ఉంది..

మిస్టర్ ఏ : ఎలా ఉందిరా సినిమా ?
మిస్టర్ బి : క్రిష్ ని మెచ్చుకోవాలి. కానీ ఏదో లోటు కనిపిస్తోంది మిత్రమా.
మిస్టర్ ఏ : ఏం లోటురా.. బాలయ్య ఇరగదీస్తే ?
మిస్టర్ బి : అది కాదు సినిమాను ఇంకాస్త ఎమోషనల్ గా చెప్పుంటే బాగుండేది.
మిస్టర్ ఏ : అంటే ఇప్పుడేమంటావ్ ?
మిస్టర్ బి : మంచి సినిమానే.. భీభత్సం మాత్రం కాదు.