రివ్యూ రాజా తీన్‌మార్ : ఘాజి – తెలుగు సినిమా స్థాయిని మరో ఎత్తుకు తీసుకెళ్లింది.

Friday, February 17th, 2017, 09:00:08 PM IST


తెరపై కనిపించిన వారు : రానా, కే కే మీనన్, అతుల్ కులకర్ణి, తాప్సి

కెప్టెన్ ఆఫ్ ‘ఘాజి’ : సంకల్ప్ రెడ్డి

మూలకథ :

పాకిస్థాన్ ఆర్మీ బంగ్లాదేశ్ (పశ్చిమ పాకిస్థాన్) లో పోరాడుతున్న తన సైనికులకు సహాయం చేయడానికి కరాచీలో ఉన్న నేవల్ బేస్ నుండి బంగ్లాదేశ్ తీర ప్రాంతానికి ‘ఘాజి’ అనే సబ్ మెరైన్ ను పంపుతుంది. ఆ సబ్ మెరైన్ భారతీయ జలాల గుండా వెళ్లి మాత్రమే బంగ్లాదేశ్ ను చేరుకోవాలి. కానీ ఈ మధ్యలో బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న భారతీయ జలాలకు ఇండియాకు చెందిన యుద్ధ వాహక నౌక ఐఎన్ఎస్ పేల్చి తర్వాత బంగ్లాదేశ్ చేరుకోవాలని వాళ్ళు పథకం వేస్తారు.

ఇంటెలిజెన్స్ ద్వారా ఆ ప్లాన్ తెలుసుకున్న ఇండియన్ నేవీ భారతీయ జలాంతర్గామి ఎస్21 ను వాళ్ళని అడ్డుకోవడం కోసం సముద్రంలోకి పంపుతుంది. దాంతో ‘ఘాజి’ ముందుగా ఎస్ 21 ను ఎదుర్కోవాల్సి వస్తుంది, అలాగే విశాఖపట్టణ ఓడరేవుని కూడా పేల్చేయాలని ప్లాన్ చేస్తుంది. కానీ ఎస్ 21 వారికి అడ్డుతగులుతుంది. తర్వాత ఆ రెండు జలాంతర్గాముల మధ్య యుద్ధం ఎలా సాగింది ? ఇండియన్ లెఫ్టినెంట్ కమాండెంట్ అర్జున్ వర్మ( రానా) యుద్ధం ఎలా నడిపాడు ? చివరికి ఎవరు గెలిచారు ? అనేదే ఈ సినిమా కథ.

విజిల్ పోడు :
–> దర్శకుడు సంకల్పు వాస్తవ చరిత్రని,కల్పనను కలగలిపి తయారు చేసిన వార్ డ్రామా చాలా బాగుంది. చెప్పాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలను చెబుతూనే సినిమాకు కావలసిన డ్రామాను నడపడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఆయన చేసిన ఈ ప్రయత్నం గొప్పగా, మెచ్చుకోదగిందిగా ఉంది. పైగా చివర్లో పాక్ ఈ చరిత్రను ఎలా వక్రీకరించిందో కూడా చెప్పడం బాగుంది. కనుక మొదటి విజిల్ ఆయనకే వెయ్యాలి.

–> ఇక సబ్ మెరైన్ ఎస్ 21, ఘాజి ల సెట్లను నిర్మించిన తీరు కట్టిపడేసింది. సినిమా చూసియాట సేపు అదొక సెట్ అని కాకూండా నిజంగా సబ్ మెరైన్ లో ఉన్న ఫీల్ కలిగింది. అందులోని ప్రతి ఒక్క సాంకేతిక విభాగాన్ని చాలా వాస్తవంగా సృష్టించారు. కనుక దానికి రెండో విజిల్ వేసుకోవచ్చు.

–> విఎస్ఎక్స్ ద్వారా జలాంతర్గామి నీళ్ళలోకి వెళ్లడం, అక్కడ పరస్పర యుద్ధం చేయడం, టార్పీడోలు(మిస్సైల్స్) ప్రయోగించడం, సబ్ మెరైన్స్ దెబ్బతినడం వంటి అంశాలను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చేశారు. దర్శకుడు సంకల్ప్ రెడ్డి కూడా మంచి యుద్ధ ప్రణాళికలను తయారు చేసి ఆకట్టుకున్నాడు. మూడో విజిల్ ఈ అంశాలకు వేయొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమాలోని ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్లలో ఎమోషన్ కొంత వరకు మిస్సై నిరుత్సాహాన్ని కలిగించింది. అదే గనుక పూర్తి స్థాయిలో ఉండి ఉంటే సినిమా ఫలితం ఇంకా గొప్పగా ఉండేది.

–> తాప్సి పాత్రను కొన్ని అంశాలకే పరిమితం చేయడం నిరుత్సాహ పరచగా, ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించాయి.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..!

–> ఒక ఓడ మొత్తం బాంబు దాడితో ముక్కలు ముక్కలైపోగా తాప్సి, ఇంకో చిన్న పాప మాత్రం ఏమాత్రం గాయాలు కాకుండా చాలా సేఫ్ గా బయటపడటం కాస్తంత వింతగానే ఉంటుంది.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల ముచ్చట ఇలా ఉంది..

మిస్టర్ ఏ : సినిమా చాలా బాగుంది. ఆ కథ, విజువల్స్, స్టోరీ చెప్పడం భలే నచ్చాయి.
మిస్టర్ బి : కానీ కీలక సన్నివేశాల్లో ఎమోషన్ కాస్త తగ్గినట్టనిపించింది.
మిస్టర్ ఏ : నిజమే. అయినా ఇది మాత్రం తెలుగు సినిమా స్థాయిని మరో ఎత్తుకు తీసుకెళ్లింది.
మిస్టర్ బి : అవును. నువ్వు చెప్పింది కరెక్ట్.