రివ్యూ రాజా తీన్‌మార్ : గురు – భిన్నమైన సినిమా మాత్రమే కాదు మంచి సినిమా కూడా !

Friday, March 31st, 2017, 04:56:53 PM IST


తెరపై కనిపించిన వారు : వెంకటేష్, రితిక సింగ్

కెప్టెన్ ఆఫ్ ‘గురు’ : సుధా కొంగర

మూల కథ :

ఫెయిల్యూర్ బాక్సర్ ఆదిత్య (వెంకటేష్) ఎవ్వరినీ లెక్కచెయ్యకుండా, బాక్సింగే సర్వస్వంగా భావిస్తూ తన ఇష్టానుసారం బ్రతుకుతుంటాడు. అలాంటి అతన్ని ఢిల్లీలో ఇండియన్ ఉమెన్ బాక్సింగ్ టీమ్ కు కోచ్ గా నియమిస్తారు. కానీ ఫెడరేషన్లోని కొందరు శత్రువులు అతన్ని అన్యాయంగా వైజాగ్ కు బదిలీ చేస్తారు. అలా వైజాగ్ వచ్చిన ఆదిత్య అక్కడేకూలి పనులు చేసుకునే అమ్మాయి రామేశ్వరి(రితికా సింగ్) లో ఉన్న బాక్సింగ్ టాలెంట్ ని గుర్తించి ఆమెకు ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటాడు.

కానీ రామేశ్వరి మాత్రం అతనిలోని తపనను, నిజాయితీని పట్టించుకోకుండా పెంకి వేషాలు వేస్తూ అతనికి కోపం తెప్పిస్తుంది. మరోవైపు ఫెడరేషన్ సభ్యులు కూడా ఆదిత్యను తొక్కాలని ప్రయత్నాలు జరుపుతుంటారు. ఈ ఇబ్బందులు మధ్య ఆదిత్య రామేశ్వరిని ఎలా మార్చాడు ? ఆమెకు ఏ విధంగా శిక్షణ ఇచ్చాడు ? వరల్డ్ చాంపియన్ ను ఎలా చేశాడు ? అందుకోసం అతను ఏం కోల్పోయాడు ?

అలా వైజాగ్ చేరుకున్న కోచ్ ఆదిత్య అక్కడే లోకల్ గా కూరగాయలమ్ముకునే రామేశ్వరి (రితికా సింగ్)ని చూసి ఆమెలోని టాలెంట్ ను గుర్తించి ఎలాగైనా ఆమెకు ట్రైనింగ్ ఇచ్చి తాను సాధించలేని కలను ఆమె ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటాడు. కానీ రామేశ్వరి మాత్రం అతని నిజాయితీని, తపనను గుర్తించదు, అలాగే ఫెడరేషన్ ఉన్నశత్రువులు కూడా అతని ప్రయత్నాలను అడ్డుపడుతుంటారు. ఇన్ని అడ్డంకుల మధ్య ఆదిత్య రామేశ్వరిని ఏవిదంగా ట్రైన్ చేస్తాడు ? ఎలా వరల్డ్ ఛాంపియన్ ను చేస్తాడు ? అందుకోసం అతను ఏం కోల్పోయాడు ? అనేదే ఈ సినిమా కథ..

విజిల్ పోడు :
–> మొదటి విజిల్ విక్టరీ వెంకటేష్ కు వేయాలి. బాక్సింగ్ అంటే భక్తి, ఓటమి వలన వచ్చిన ఫ్రెస్ట్రేషన్ కలిగిన ఒక కోచ్ గా ఆయన నటన అద్భుతం. ఇది వరకు తెలుగు ప్రేక్షకులు చూడని వెంకీ ఈ సినిమాలో కనిపిస్తాడు. ఆరంభం నుండి చివరి దాకా ఒకే ఎమోషన్ ను క్యారీ చేస్తూ ఆయన ఇచ్చిన పెర్ఫార్మెన్స్ చాలా సహజంగా ఉంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ వంటి కొన్ని ఎమోషనల్ సన్నివేశాలలో ఆయన నటన మనసుకు హత్తుకునేలా ఉంది.

–> ఇక వెంకీ శిష్యురాలిగా నటించిన రితికా సింగ్ కు కూడా ఒక విజిల్ వేసుకోవచ్చు. పక్కా మాస్ ప్రవర్తన కలిగిన ఒక పెంకి అమ్మాయిగా చాలా ఎనర్జిటిక్ గా నటించిందామె. ఇప్పటిదాకా తెలుగువారు చూడని హీరోయిన్ పాత్రను చూపిస్తుంది. ఇక వెంకీకి, ఆమెకు మధ్య నడిచి ఈగో సన్నివేశాలు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి.

–> ఇక చివరి విజిల్ దర్శకురాలు సుధా కొంగరకు వేయొచ్చు. ఇండియన్ ఉమెన్ బాక్సింగ్ ఫెడరేషన్ జరుగుతున్న అవకతవకలను, బాక్సింగ్ కోసం ఆరాటపడే పేద అమ్మాయిల జీవితాలను ఆధారంగా చేసుకుని ఆమె రాసిన కథ, పాత్ర చిత్రీకరణ, కథనం చాలా బాగున్నాయి. వాటిని తెరకెక్కించిన తీరు చాలా ఆకట్టుకుంది.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమా ప్రథమార్థమంతా చాలా బాగా నడిచిపోగా సెకండాఫ్ మాత్రం డ్రామా కాస్త ఎక్కువై నెమ్మదించినట్టు అనిపించింది. రితికా సింగ్ పాత్రపై నడిచే కొన్ని సన్నివేశాలు ఆసక్తిని కాస్త సన్నగిల్లేలా చేశాయి.

–> ఇక క్లైమాక్స్ ఫైట్ లో పూర్తిగా తీవ్రత లోపించింది. అదొక వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీ అనేలా లేదు.

–> అలాగే సెకండాఫ్లో వెంకీ రితికా సింగ్ ను పూర్తిస్థాయిలో ట్రైన్ చేసే సన్నివేశాలు ఇంకొన్ని కథనంలో యాడ్ చేసి ఉంటే ఇంకాస్త బాగుండేదనిపించింది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> ఇది వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన సినిమా. ఇందులో అంత విచిత్రంగా తోచే అంశాలు, సన్నివేశాలు లేవు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు ప్రేక్షకులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ: చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ సినిమా చూసినట్టుంది కదా !
మిస్టర్ బి: డిఫరెంట్ మాత్రమే కాదు.. మంచి సినిమా కూడ.
మిస్టర్ ఏ: అవునవును వెంకీ లేటుగా వచ్చినా మంచి సినిమాతోనే వచ్చాడు.