రివ్యూ రాజా తీన్‌మార్ : కేశవ – కథనం, కథానాయకుడి పాత్రలో కసి తక్కువైంది !

Friday, May 19th, 2017, 06:20:17 PM IST

తెరపై కనిపించిన వారు: నిఖిల్ సిద్దార్థ, రితు వర్మ

కెప్టెన్ ఆఫ్ ‘కేశవ’ : సుధీర్ వర్మ

మూల కథ :

కారు ప్రమాదం మూలాన కుటుంబమని కోల్పోయిన కేశవ (నిఖిల్ సిద్దార్థ) అనే కుర్రాడు ఆ ప్రమాదానికి కారణమైన వాళ్ళను చంపాలనే పగతో పెరిగి పెద్దై ఒక్కొక్కర్ని చంపడం మొదలుపెడతాడు. అతని చేతిలో చనిపోతున్న అందరు పోలీసులే కావడంతో డిపార్ట్మెంట్ కేశవను పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అసలు కేశవ పోలీసుల్ని ఎందుకు టార్గెట్ చేశాడు. అతని తల్లి దండ్రుల మరణానికి వాళ్లకు సంబంధమేమిటి ? చివరికి కేశవ పగ ఎలా తీరింది ? అనేదే కథ..

విజిల్ పోడు :
–> దర్శకుడు సుధీర్ వర్మ పాటలు, డ్యాన్సులు,రోమాన్స్ అనే కథకు అవసరంలేని అంశాలను పక్కనబెట్టి తక్కువ రన్ టైంలో మంచి సినిమాను తీద్దాం అని చేసిన ప్రయత్నం బాగుంది. పైగా సినిమా కథనం కూడా ఎక్కడా డీవియేట్ అవ్వకుండా తీశాడు.

–> హీరో నిఖిల్ కూడా తన పాత్రకు తగ్గట్టు సినిమా మొత్తం ఒకే విధంగా నటించి మెప్పించాడు. అతని పెర్ఫార్మెన్స్ కు రెండవ విజిల్ వేసుకోవచ్చు.

–> ఫస్టాఫ్, సెకండాఫ్లలో వచ్చే వెన్నెల కిశోర్ కామెడీ చాలా వరకు నవ్వించింది. అలాగే సెకండాఫ్లో రివీల్ అయ్యే అసలు కథ కొంచెం ఆసక్తికరంగానే ఉంది. కనుక మూడో విజిల్ దానికి వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమా ఆరంభంలో హీరోకు గుండె కుడివైపు ఉంటుందని చెప్తారు గాని కథానములో దానికి సంబందించిన బలమైన సన్నివేశాలు ఒక్కటి కూడా లేకపోవడం నిరుత్సాహపరిచింది.

–> అలాగే ఫస్టాఫ్ కామెడీ, పాత్రల పరిచయం మినహా హీరో హత్యలు చేయడం, తప్పించుకుని తిరగడం, పోలీసులు కష్టపడటం వంటి అంశాలు మరీ రోటీన్ గా ఉన్నాయి.

–> ట్రైలర్ చూసి హీరో క్యారెక్టర్ భీభత్సం సృష్టించడం ఖాయం అనుకుంటే అలాంటిదేమీ సినిమాలో కనబడలేదు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> హీరో హత్యలు చేస్తున్నాడని పోలీసులకు తెలిసినా కూడా ఆధారాలు లేవని, మీడియాకు భయపడి అతన్ని అలాగే వదిలేయడం విచిత్రంగానే ఉంటుంది.

–> అప్పటి వరకు హీరోని పట్టుకోవాలని తెగ కష్టపడ్డ సిన్సియర్ స్పెషల్ ఆఫీసర్ అతని గతం తెలిసేసరికి ఉన్నట్టుండి మారిపోయి, అతనికి సపోర్ట్ చేయడం కూడా మరీ నాటకీయంగా ఉంటుంది.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ: సినిమా బాగుంది కదా ?
మిస్టర్ బి : బాగుంది కానీ గొప్పగా మాత్రం లేదు.
మిస్టర్ ఏ: అవునవును ట్రైలర్లలో చెప్పినంత లేదు. ఎందుకంటావ్ ?
మిస్టర్ బి : ముఖ్యమైన కథనం, హీరో పాత్రలో ప్రేక్షకుల్ని కదిలించే కసి లేదు. అందుకే.