తెరపై కనిపించిన వారు : చిరంజీవి, కాజల్ అగర్వాల్
కెప్టెన్ ఆఫ్ ‘ఖైదీ నెం 150’ : వివి వినాయక్
మూల కథ :
కత్తి శీను (చిరంజీవి).. అల్లరి చిల్లరగా చిన్న చిన్న నేరాలు చేసుకుంటూ ఉండే వ్యక్తి. ఒకసారి జైలు నుంచి పారిపోయి వచ్చిన అతడికి, తనలానే ఉండే శంకర్ (చిరంజీవి) తారసపడతాడు. ఒక ప్రమాదంలో ఉన్న శంకర్ స్థానంలోకి కత్తి శీను వెళ్ళిపోయి దర్జాగా జీవితం గడపాలనుకుంటాడు. కాగా శంకర్‌కు ఒక పెద్ద ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. అతడ్ని నమ్ముకొని ఒక ఊరే తమ (రైతుల) కష్టాలను తీర్చే వ్యక్తిగా శంకర్‌ను చూస్తుంది. అలాంటి వ్యక్తి స్థానంలోకి వెళ్ళిన కత్తి శీనుకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అవి అతన్ని ఎలా మార్చాయి ? శంకర్ ఏమయ్యాడు? శంకర్ ఊరు ఎదుర్కొనే సమస్యేంటి?
విజిల్ పోడు:
–> సినిమాలో మొదటి విజిల్ ఎవరికీ వేయాలో వేరే చెప్పనక్కర్లేదు. అది మెగాస్టార్ చిరంజీవికే. 9 ఏళ్ల తరువాత కనిపించిన ఆయన అభిమానులకు కనులవిందు చేశాడు. తన వైపు నుండి ఎక్కడా వారిని నిరుత్సాహపరచలేదు.
–> ఇక సినిమా పాటల్లో అయన చేసిన డ్యాన్సులు అద్భుతహా ఆనేలా ఉన్నాయి. సుమారు ఒక 10 సరికొత్త ట్రేడ్ మార్క్ స్టెప్పులు వేసి తనలో గ్రేస్ తగ్గలేదని చెబుతూ బోలెడు విజిల్స్ వేయించుకున్నాడు.
–> ఇక దర్శకుడు వినాయక్ ఫస్టాఫ్‌లో రైతుల సమస్యలను చాలా ఎమోషనల్ ఎలివేట్ చేసి కదిలించాడు. కనుక మూడో విజిల్ ఆయనకే వేయొచ్చు.
ఢమ్మాల్ – డుమ్మీల్ :
–> ఈ సినిమాలో విలన్ పాత్ర అతిపెద్ద ఢమ్మాల్. ఎక్కడా చిరంజీవి స్థాయిని అందుకోలేకపోయి సినిమాలోని ఇంటెన్సిటీని దెబ్బతీసింది.
–> అలాగే దర్శక రచయితలు ఫస్టాఫ్‌లో రైతుల సమస్యలను చాలా గొప్పగా ఎలివేట్ చేసి సెకండాఫ్‌లో దానికి సరైన సొల్యూషన్ చూపడంలో విఫలమై నిరుత్సాహపరిచారు.
–> ఇక సినిమాలో కాజల్ పాత్ర గ్లామరస్ గా ఉన్నప్పటికీ కథలో పెద్దగా ఇన్వాల్వ్ కాక పాటల వరకే పరిమితమైంది.
దేవుడా ఈ సిత్రాలు చూశారా..!
–> ఇందులో అంత విచిత్రమైన అంశాలు ఏవీ కనబడలేదు. కనుక ఈ కాలమ్ ను ఖాళీగా వదిలేస్తున్నాం.
చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల సమభాషణ ఇలా ఉంది..
మిస్టర్ ఏ : సినిమా ఎలా ఉందిరా.. బాస్ ఈజ్ బ్యాక్ కదా ?
మిస్టర్ బి : నాకు యావరేజ్ అనిపించింది.
మిస్టర్ ఏ : రేయ్ పాటలు, మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, కామెడీ అన్నీ బాగున్నాయి కదా.
మిస్టర్ బి : అందుకే యావరేజ్ అన్నాను.
మిస్టర్ ఏ : మరి నాకేమో పిచ్చ పిచ్చగా నచ్చేసింది ?
మిస్టర్ బి : నువ్వంటే వీరాభిమానివి, నేను కామన్ ఆడియన్ అందుకని.