‘మేము సైతం’ అంటూ స్టార్స్ భారీ యాక్షన్..!

Thursday, November 20th, 2014, 08:08:10 AM IST


హుదూద్ తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి తెలుగు సినీ పరిశ్రమ మరోసారి రంగంలోకి దిగుతోంది. టాలీవుడ్ స్టార్లు ‘మేము సైతం’ అంటూ ఓ భారీ కార్యక్రమాన్ని ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు టాలీవుడ్ స్టార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమ వివరాలు తెలిపారు. ఈ నెల 29న రాత్రి 7.30 గంటల నుంచి 10.30 వరకు నటీనటులతో విందు కార్యక్రమం ఉంటుందని నాగార్జున తెలిపారు. కేవలం 250 జంటలకు మాత్రమే ప్రవేశముంటుందని.. జంట అంటే భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కావచ్చని చెప్పారు. ఒక్కో జంటకు టికెట్ ధర లక్ష రూపాయలు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆటలు, పాటలు, డ్యాన్సులు వంటి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయని నాగ చెప్పారు. ఈ కార్యక్రమాల టికెట్ ధరలు రూ. 500 నుంచి రూ. లక్ష వరకు ఉంటాయన్నారు. తొలి టికెట్ ను నిర్మాత అల్లు అరవింద్ కొన్నారు. టికెట్లు సికింద్రాబాద్ క్లబ్, ఫిల్మ్ నగర్ క్లబ్ లాంటి చోట్ల దొరుకుతాయని, బుక్ మై షో ద్వారా కూడా పొందవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు memusaitam.com అనే వెబ్ సైట్ లో సంప్రదించవచ్చని తెలిపారు.

నవంబర్ 30న తెలుగు సినీ పరిశ్రమకి సెలవు ప్రకటించారు. పవన్, మహేష్, బాలకృష్ణ, జూ ఎన్టీఆర్, వెంకటేష్ లాంటి స్టార్స్ ఉండటంతో ఈ పోగ్రాం ట్రాన్సిమిషన్ రైట్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఫైనల్ గా జెమినీ టీవి వారు ఈ ప్రసార హక్కులను సొంతం చేసుకున్నారు.